ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌: బియాంక, క్విటోవా అవుట్‌

11 Feb, 2021 03:46 IST|Sakshi

రెండో రౌండ్‌లోనే ఓడిన గ్రాండ్‌స్లామ్‌ మాజీ చాంపియన్స్‌

మూడో రౌండ్‌లోకి సెరెనా, హలెప్, ఒసాకా

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ  

మెల్‌బోర్న్‌: సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మూడో రోజు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్‌ విభాగంలో 2019 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్, ఎనిమిదో సీడ్‌ బియాంక ఆండ్రెస్కూ (కెనడా)... 2011, 2014 వింబుల్డన్‌ చాంపియన్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్‌లో 2014 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) కూడా రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను 2019 యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో ఓడించిన బియాంక మోకాలి గాయం కారణంగా గతేడాది మొత్తం ఆటకు దూరంగా ఉంది.

ఈ ఏడాది నేరుగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడిన బియాంక రెండో రౌండ్‌ దాటి ముందుకెళ్లలేకపోయింది. 35 ఏళ్ల సె సువె (చైనీస్‌ తైపీ) 6–3, 6–2తో తొమ్మిదో ర్యాంకర్‌ బియాంక ఆండ్రెస్కూను ఓడించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. టాప్‌–10లోని క్రీడాకారిణులను ఓడించడం 71వ ర్యాంకర్‌ సె సువెకిది ఎనిమిదోసారి కావడం విశేషం. 83 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో బియాంక ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు, 25 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్‌లో సొరానా కిర్‌స్టియా (రొమేనియా) 6–4, 1–6, 6–1తో క్విటోవాపై సంచలన విజయం సాధించింది. రెండు గంటల మూడు నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సొరానా ఆరుసార్లు క్విటోవా సర్వీస్‌ను బ్రేక్‌ చేసింది.  

సెరెనా జోరు...
కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగిన అమెరికా దిగ్గజం సెరెనా మరో అడుగు ముందుకేసింది. నినా స్లొజనోవిచ్‌ (సెర్బియా)తో జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో పదో సీడ్‌ సెరెనా 6–3, 6–0తో గెలిచి మూడో రౌండ్‌కు చేరింది. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌) 6–2, 6–3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌)పై, రెండో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) 4–6, 6–4, 7–5తో తమియనోవిచ్‌ (ఆస్ట్రేలియా)పై, ఏడో సీడ్‌ సబలెంకా (బెలారస్‌) 7–6 (7/5), 6–3తో కసత్‌కినా (రష్యా)పై, 15వ సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) 6–2, 6–4తో కామిల్లా జియార్జి (ఇటలీ)పై గెలిచి మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. మాజీ నంబర్‌వన్‌ వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) 1–6, 0–6తో క్వాలిఫయర్‌ సారా ఎరాని (ఇటలీ) చేతిలో, 17వ సీడ్‌ ఎలీనా రైబకినా (కజకిస్తాన్‌) 4–6, 4–6తో ఫియోనా ఫెరో (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయారు.

అయ్యో వావ్రింకా...
పురుషుల సింగిల్స్‌ విభాగంలో 17వ సీడ్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) చేజేతులా ఓడిపోయాడు. ప్రపంచ 55వ ర్యాంకర్‌ మార్టన్‌ ఫుచోవిచ్‌ (హంగేరి)తో 3 గంటల 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా 5–7, 1–6, 6–4, 6–2, 6–7 (9/11)తో పరాజయం పాలయ్యాడు. నిర్ణాయక ఐదో సెట్‌ టైబ్రేక్‌లో వావ్రింకా 6–1తో ఆధిక్యంలో నిలిచి విజయానికి పాయింట్‌ దూరంలో నిలిచాడు. అయితే ఫుచోవిచ్‌ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి స్కోరును 6–6తో సమం చేశాడు. చివరకు ఫుచోవిచ్‌ 11–9తో టైబ్రేక్‌లో గెలిచి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–3, 6–7 (3/7), 7–6 (7/2), 6–3తో టియాఫో (అమెరికా)పై, మూడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 6–4, 6–0, 6–2తో కోఫెర్‌ (జర్మనీ)పై, ఆరో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 7–5, 6–4, 6–3తో క్రెసీ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్‌ ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా) 6–2, 6–0, 6–3తో ములెర్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచారు. 11వ సీడ్‌ షపోవలోవ్‌ (కెనడా), 14వ సీడ్‌ రావ్‌నిచ్‌ (కెనడా), 15వ సీడ్‌ కరెనో బుస్టా (స్పెయిన్‌), 18వ సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా) కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు.  

బోపన్న జంట ఓటమి
పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–బెన్‌ మెక్లాలన్‌ (జపాన్‌) జంట 4–6, 6–7 (0/7)తో జీ సుంగ్‌ నామ్‌–మిన్‌ క్యు సాంగ్‌ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.   
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు