డిగ్రీ పరీక్షలు రాయనున్న ప్రధాని మోదీ, ఎంఎస్‌ ధోని!

11 Sep, 2022 19:52 IST|Sakshi

అదేంటి ప్రధాని మోదీ, టీమిండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని ఇప్పుడు డిగ్రీ పరీక్షలు రాయడం ఏంటని ఆశ్చర్యపోకండి. ఇదంతా నకిలీ హాల్‌టికెట్ల గోల మాత్రమే. సెలబ్రిటీల పేర్లతో యునివర్సిటీ, కాలేజీల్లో అడ్మిషన్లు.. హాల్‌టికెట్స్‌పై ఫోటోతో పాటు పేర్ల ముద్రణ అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కొందరు ఆకతాయిలు చేసే పనుల వల్ల ఆయా వర్సీటీలు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరికొన్ని సార్లు సాంకేతిక లోపంతో ఇలాంటివి జరుగుతుంటాయి.

తాజాగా బిహార్‌లో ఒక యూనివర్సిటీకి చెందిన డిగ్రీ పరీక్షల అడ్మిట్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఫొటోలు ముద్రించడం కలకలం రేపింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న యూనివర్సిటీ దర్యాప్తునకు ఆదేశించింది. బిహార్‌లోని లలిత్‌ నారాయణ్‌ మిథిలా యూనివర్సిటీలో డిగ్రీ పరీక్షల కోసం ఇటీవల అడ్మిట్‌ కార్డులు జారీ చేశారు. అందులో కొన్ని అడ్మిట్‌ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ, బిహార్‌ గవర్నర్ ఫగూ చౌహాన్‌ ఫొటోలు ఉన్నాయి.


బిహార్‌లోని లలిత్‌ నారాయణ్‌ మిథిలా యూనివర్సిటీ

మధుబనీ, సమస్తిపూర్‌, బెగుసరాయ్‌ జిల్లాల పరిధిలోని కాలేజీలకు చెందిన బీఏ మూడో ఏడాది విద్యార్థులకు ఈ అడ్మిట్ కార్డులు వచ్చాయి. ఈ విషయం యూనివర్సిటీ దృష్టికి రాగా అధికారులు సీరియస్ అయ్యారు. ఆ ఫొటోలను విద్యార్థులే అప్‌లోడ్‌ చేసినట్లు భావిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు కారణమైన వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంతోపాటు వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యేలా ఫిర్యాదు చేస్తామన్నారు.

''అడ్మిట్‌ కార్డుల జారీ ప్రక్రియ ఆన్‌లైన్‌లో కొనసాగుతుంది. ఈ క్రమంలో విద్యార్థులే తమ ఫొటోలతో పాటు వివరాలను అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం వాటిని పరిశీలించి అడ్మిట్‌ కార్డులు జారీ చేస్తాం. ఇదే సమయంలో కొందరు విద్యార్థులు బాధ్యతారహితంగా ప్రవర్తించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. యూనివర్సిటీ పేరుకు మచ్చతెచ్చే ఇలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించాం.'' అని యునివర్సిటీ రిజిస్ట్రార్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు