‘2 నిమిషాల బ్యాటింగ్‌కు ఏమీ కాదు కదా’

29 Sep, 2020 20:36 IST|Sakshi

దుబాయ్‌: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ సూపర్‌ ఓవర్‌లో ఓడిపోవడానికి సరైన వ్యూహ రచన లేకపోవడమే కారణమని మాజీ క్రికెటర్లు సునీల్‌ గావస్కర్‌, కెవిన్‌ పీటర్సన్‌లు విమర్శించారు. సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేసే క్రమంలో ఇషాన్‌ కిషన్‌ను పంపకపోవడం అతిపెద్ద తప్పిదమన్నారు. సూపర్‌ ఓవర్‌ అనేది ఒకే ఓవర్‌ కాబట్టి ఇక్కడ అలసి పోవడం అనేది ఏమీ ఉండదన్నారు. సూపర్‌ ఓవర్‌లో  రెండు నిమిషాల బ్యాటింగ్‌కు ఏమౌతుందో ముంబై ఇండియన్స్‌ యాజమాన్యానికే తెలియాలన్నారు. సూపర్‌ ఓవర్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ చేసిన క్రమంలో పొలార్డ్‌కు జతగా హార్దిక్‌ పాండ్యా రావడాన్ని వీరు తప్పుబట్టారు. 

అప్పటివరకూ ఆడిన బ్యాట్స్‌మన్‌ ఆడితే షాట్లు కొట్టడానికి ఈజీగా ఉంటుందని, అది వదిలేసి హార్దిక్‌ను పంపడం సరైనది కాదన్నారు. కేవలం డగౌట్‌లో కూర్చొని సూపర్‌ ఓవర్‌ను చూసిన ఇషాన్‌.. బ్యాటింగ్‌కు రావడానికి మొగ్గుచూపి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు కూడా ఇదే తరహా పొరపాటు చేసిందనే విషయాన్ని పీటర్సన్‌ గుర్తు చేశాడు. సూపర్‌ ఓవర్‌లో ఫామ్‌లో ఉన్న మయాంక్‌ను వదిలేసి పూరన్‌ను పంపించిందని అదే ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణమన్నాడు. ఇప్పుడు ముంబై కూడా తన తప్పిదాన్ని గుర్తించాలన్నాడు. ఇక్కడ తాను ఇషాన్‌ కిషన్‌ను విమర్శించడం లేదని, కానీ ముంబై చేసిన పొరపాటు అయితే కచ్చితంగా అదేనన్నాడు.ఇషాన్‌ కిషన్‌ అలసి పోవడం కారణంగానే పొలార్డ్‌-హార్దిక్‌లను సూపర్‌ ఓవర్‌లు పంపామని రోహిత్‌ శర్మ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇది మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయమైనా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.(చదవండి: ‘సూపర్‌ ఓవర్‌లో ఇషాన్‌ను అందుకే పంపలేదు’)

Poll
Loading...
మరిన్ని వార్తలు