Pro Kabaddi League 2022: కొద్దిగా ఆగి ఉంటే వేరుగా ఉండేది.. ఊహించని ట్విస్ట్‌

9 Oct, 2022 07:44 IST|Sakshi

ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌) సీజన్‌-9లో తమిళ్‌ తలైవాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. శనివారం కంఠీరవ ఇండోర్‌ స్టేడియంలో గుజరాత్‌ జెయింట్స్‌తో తమిళ్‌ తలైవాస్‌ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడింది. అయితే మ్యాచ్‌ సందర్భంగా తలైవాస్‌ కెప్టెన్‌ పవన్‌ సెహ్రావత్‌ తీవ్ర​ంగా గాయపడ్డాడు. ఇదంతా మ్యాచ్‌ మొదటి హాఫ్‌ తొలి 10 నిమిషాల్లోనే జరిగింది.

గుజరాత్‌ జెయింట్స్‌, తమిళ్‌ తలైవాస్‌లు 7-7తో సమంగా ఉన్న సమయంలో గుజరాత్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ చంద్రన్‌ రంజిత్‌ రైడ్‌కు వచ్చాడు. ఆ సమయంలో మ్యాట్‌పై తమిళ్‌ తలైవాస్‌ నుంచి ఇద్దరే ఉన్నారు. కెప్టెన్ పవన్‌ సెహ్రావత్‌ సహా సాహిలా గులియాలు ఉన్నారు. సూపర్‌ టాకిల్‌ చేస్తే పాయింట్లు వచ్చే అవకాశం ఉండడంతో సాహిల్‌.. చంద్రన్‌ రంజిత్‌ అప్పర్‌ బాడీని పట్టుకునే ప్రయత్నం చేయగా.. పవన్‌ చంద్రన్‌ కాలును గట్టిగా హోల్డ్‌ చేశాడు. కొద్దిగా ఆగితే పాయింట్లు వచ్చేవే.

కానీ ఇక్కడే ఊహించని పరిణామం జరిగింది. పవన్‌ పట్టు సాధించే క్రమంలో అతని మోకాలు బెణికింది. దీంతో మ్యాట్‌పై పడిపోయిన పవన్‌ నొప్పితో విలవిల్లాడిపోయాడు. అంతసేపు గట్టిగా అరుస్తున్న అభిమానులు కూడా సైలెంట్‌ అయిపోయారు. వెంటనే మెడికల్‌ స్టాప్‌ వచ్చి పవన్‌ సెహ్రావత్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. నొప్పి చూస్తుంటే గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. అయితే తమిళ్‌ తలైవాస్‌ కోచ్‌ జె. ఉదయ్‌ కుమార్‌ మాత్రం పవన్‌ సెహ్రావత్‌ 2-3 రోజుల్లో కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక పవన్‌ సెహ్రావత్‌ను తమిళ్‌ తలైవాస్‌ రూ. 2.26 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం విశేషం.

ఇక కెప్టెన్‌ పవన్‌ సెహ్రావత్‌ స్థానంలో నరేందర్‌ రైడర్‌గా అరంగేట్రం చేశాడు. ఇక గుజరాత్‌ జెయింట్స్, తమిళ్‌ తలైవాస్‌ మ్యాచ్ 31–31తో డ్రాగా ముగిసింది. తలైవాస్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ రెయిడర్‌ రాకేశ్‌ 13 పాయింట్లతో అదరగొట్టాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో పట్నా పైరేట్స్‌; బెంగాల్‌ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్‌; పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్‌ తలపడతాయి.  

చదవండి: Pro Kabaddi league 2022: పట్నాను నిలువరించిన పుణేరి పల్టన్‌

మరిన్ని వార్తలు