Pro Kabaddi League 9: కూతకు వేళాయె!

7 Oct, 2022 05:44 IST|Sakshi

నేటినుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌–9

బరిలో 12 జట్లు

రా.గం. 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

బెంగళూరు: ఎనిమిది సీజన్లుగా అలరిస్తున్న కబడ్డీ మరోసారి అభిమానుల ముందుకు వచ్చింది. ప్రతిష్టాత్మక ప్రొ కబడ్డీ లీగ్‌ తొమ్మిదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. బెంగళూరులో నేడు ఈ టోర్నీ ప్రారంభం కానుంది. బెంగళూరుతో పాటు హైదరాబాద్, పుణే నగరాల్లో అన్ని మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో టీవీలకే పరిమితమైన అభిమానులు ఈ సారి నేరుగా ఆటను ఆస్వాదించడం అవకాశం నిర్వాహకులు కల్పిస్తున్నారు. ఈ మూడు వేదికల్లోనూ ఫ్యాన్స్‌ను అనుమతించనున్నారు. మొత్తం 12 జట్లు లీగ్‌ బరిలోకి దిగుతున్నాయి. లీగ్‌లో భాగంగా మొత్తం 66 మ్యాచ్‌లు జరుగుతాయి. శుక్రవారం జరిగే తొలి పోరులో యు ముంబాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ దబంగ్‌ ఢిల్లీ తలపడుతుంది. జాతీయ క్రీడల్లో కబడ్డీ ఈవెంట్‌ ముగిసిన వారం రోజుల్లోపే అందరూ ఆటగాళ్లు లీగ్‌కు సిద్ధమై బరిలోకి దిగుతున్నారు.

రాహుల్‌ రెడీ
లీగ్‌ వేలంలో రూ. 2.26 కోట్ల విలువ పలికిన పవన్‌కుమార్‌ సెహ్రావత్‌ (తమిళ్‌ తలైవాస్‌)పై     అందరి దృష్టీ నిలిచి ఉంది. గత సీజన్‌లో పునేరీ తరఫున పేలవ ప్రదర్శన కనబర్చిన స్టార్‌ రాహుల్‌ చౌదరి గాయంనుంచి కోలుకొని ఈ సారి జైపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది సీజన్లలో పట్నా పైరేట్స్‌ 3 సార్లు విజేతగా నిలవగా...బెంగాల్‌ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబంగ్‌ ఢిల్లీ, జైపూర్‌ పింక్‌ పాంథర్స్,     యు ముంబా ఒక్కోసారి విజేతగా నిలిచాయి.  

టైటాన్స్‌ రాత మారేనా!
ప్రొ కబడ్డీ లీగ్‌లో ఇప్పటి వరకు టైటిల్‌ గెలవని జట్లలో తెలుగు టైటాన్స్‌ ఒకటి. ఎనిమిది సీజన్లు కలిపి 148 మ్యాచ్‌లలో 52 గెలిచిన టైటాన్స్, అంతకంటే ఎక్కువ పరాజయాలు (77) నమోదు చేసింది. అయితే ఇతర జట్లకంటే ఎక్కువ ‘డ్రా’లు (19) కూడా టైటాన్స్‌ ఖాతాలో ఉన్నాయి. వీటిని విజయాలుగా మలచుకోగలిగితే కథ వేరేగా ఉండేదేమో. టైటాన్స్‌ జట్టు పేలవ ప్రదర్శనతో ఏడో సీజన్‌లో 11వ, ఎనిమిదో సీజన్‌లో 12వ స్థానాల్లో నిలిచింది. అయితే ఈ సారి జట్టు కాస్త మెరుగ్గా, సమతూకంగా కనిపిస్తోంది. గత రెండు సీజన్లలో ఆకట్టుకున్న రైడర్‌ అభిషేక్‌ సింగ్‌ను తీసుకోగా, మనూ గోయత్, సిద్ధార్థ్‌ దేశాయ్‌ మళ్లీ జట్టులోకి వచ్చారు. అంకిత్‌ బెనివాల్, రజనీశ్, డిఫెన్స్‌లో విశాల్‌ భరద్వాజ్‌ జట్టుకు కీలకం కానున్నారు. వెంకటేశ్‌ గౌడ్‌ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. నేడు తమ తొలి పోరులో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడుతుంది.

మరిన్ని వార్తలు