శ్రీలంకతో న్యూజిలాండ్‌ మూడో టీ20.. మ్యాచ్‌ మధ్యలో విమానం

8 Apr, 2023 14:42 IST|Sakshi

NZ VS SL 3rd T20: క్వీన్స్‌టౌన్‌లోని జాన్‌ డేవిస్‌ మైదానంలో ఇవాళ (ఏప్రిల్‌ 10) న్యూజిలాండ్‌-శ్రీలంక జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొంది, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌ మరో బంతి మిగిల్చి లక్ష్యాన్ని చేరుకుంది (19.5 ఓవర్లలో 183/6).

న్యూజిలాండ్‌ గెలుపుకు ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం కాగా.. చాప్‌మన్‌ తొలి బంతికే సిక్సర్‌ కొట్టి లక్ష్యానికి చేరువ చేసినప్పటికీ.. కివీస్‌ మరుసటి 3 బంతులకు 3 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిపోయింది. అయితే 19వ ఓవర్‌ ఐదో బంతికి రచిన్‌ రవీంద్ర 2 పరుగులు తీయడంతో న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటింగ్‌ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లంక బ్యాటర్లు తమ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగానే, ఇంచుమించు చేతికందేంత ఎత్తులో ఓ విమానం​ టేకాఫ్‌ అయ్యింది. ఇది పెద్దగా పట్టించుకోకుండా ఆటగాళ్లు ఆటను కొనసాగించగా.. మైదానంలో ఉన్న ప్రేక్షకులు ఏమాత్రం బెరుకు లేకుండా ఆటను ఆస్వాధిస్తూ కనిపించారు.

విమానం మ్యాచ్‌ మధ్యలో టేకాఫ్‌ అవుతున్న దృశ్యం సోషల్‌మీడియాలో వైరలవగా.. విషయం తెలియని వారు రకరకాలుగా ఊహించుకుంటున్నారు. జనాలకు ఇంత దగ్గరలో విమానాలు వెళితే ఎంత ప్రమాదమని కొందరంటుంటే, ఇంకొందరేమో ఇది కెమెరా ట్రిక్‌ అని లైట్‌గా తీసుకుంటున్నారు. వాస్తవ విషయం ఏంటంటే, జాన్‌ డేవిస్‌ మైదానం పక్కనే ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే ఉంది. అనునిత్యం ఇక్కడి నుంచి విమానాలు టేకాఫ్‌ అవుతుంటాయి. గతంలో చాలా సందర్భాల్లో మ్యాచ్‌లు జరుగుతుండగా విమానలు టేకాఫ్‌ అయ్యాయి.  
 

మరిన్ని వార్తలు