తుదిపోరుకు బార్టీ, ప్లిస్కోవా

9 Jul, 2021 05:28 IST|Sakshi

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ

లండన్‌: వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో మహిళల ప్రపంచ నంబర్‌వన్, ఆస్ట్రేలియా భామ యాష్లే బార్టీ, చెక్‌ రిపబ్లిక్‌ తార కరోలినా ప్లిస్కోవా తుది పోరుకు అర్హత సాధించారు. వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరడం వీరిద్దరికీ ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఈసారి సరికొత్త చాంపియన్‌ అవతరించడం ఖాయమైం ది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్‌ ప్లిస్కోవా 5–7, 6–4, 6–4తో రెండో సీడ్‌ అరీనా సబలెంకా (బెలారస్‌)పై గెలుపొందగా... టాప్‌సీడ్‌ బార్టీ 6–3, 7–6 (7/3)తో ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ)పై గెలిచింది.  

ఏస్‌ల వర్షం...
ప్లిస్కోవా, సబలెంకా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏస్‌ల వర్షం కురిసింది. మొత్తం 31 ఏస్‌లు నమోదవ్వగా... అందులో సబలెంకా 18, ప్లిస్కోవా 13 సంధించింది. గంటా 53 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ హోరాహోరీగా సాగింది. 11వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న సబలెంకా... ఆ తర్వాతి గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి తొలి సెట్‌ను గెల్చుకుంది. రెండో సెట్లో సబలెంకా అనవసర తప్పిదాలు చేస్తూ పాయింట్లను చేజార్చుకుంది. ఇదే అదనుగా ఐదో గేమ్‌లో సబలెంకా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ప్లిస్కోవా అదే దూకుడుతో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణాయక మూడో సెట్‌లోనూ చక్కటి ఆటతీరు కనబర్చిన ప్లిస్కోవా ఫైనల్‌కు చేరుకుంది.  

వారెవ్వా... బార్టీ
మరో సెమీస్‌లో టాప్‌సీడ్‌ బార్టీ మ్యాచ్‌ను దూకుడుగా ఆరంభించింది. తొలి సెట్‌ను ఆమె 6–3తో సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్లో కెర్బర్‌ గట్టిపోటీ ఇవ్వడంతో బార్టీ శ్రమించక తప్పలేదు. రెండో గేమ్‌లో బార్టీ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన కెర్బర్‌ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలుపుకొని 5–2తో ఆధిక్యంలో నిలిచింది. ఇక్కడి నుంచి బార్టీ తన అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంది. బలమైన ఫోర్‌ హ్యాండ్‌ షాట్లతో ప్రత్యర్థి పనిపట్టింది. వరుసగా మూడు గేమ్‌లను కైవసం చేసుకుని 5–5 వద్ద రెండో సెట్‌ను సమం చేసింది. అనంతరం ఇరువురు కూడా తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో మ్యాచ్‌ ‘టై బ్రేక్‌’కు దారి తీసింది. ఏకపక్షంగా సాగిన ‘టై బ్రేక్‌’లో బార్టీ చెలరేగింది. వరుసగా పాయింట్లు సాధించి 6–0 ఆధిక్యంలో నిలిచింది. బార్టీ మూడు అనవసర తప్పిదాలతో ఆధిక్యం 6–3కు తగ్గినా గెలిచేందకు ఎంతోసేపు పట్టలేదు.

మరిన్ని వార్తలు