Tokyo Olympics: దేశం మొత్తం మీ వెనుకే ఉంది.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చండి

13 Jul, 2021 19:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఒత్తిడికి లోను కాకుండా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విశ్వక్రీడల్లో పాల్గొనేందుకు భారత్‌ నుంచి తొలి బృందం ఈనెల 17న ఒలింపిక్‌ గ్రామానికి బయల్దేరనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో అథ్లెట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన భారత బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దేశం మొత్తం మీ వెనకే ఉందని అథ్లెట్లకు భరోసానిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అథ్లెట్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

అందరితో మాట్లాడిన ప్రధాని.. అథ్లెట్లు తమపై ఉన్న అంచనాల గురించి భయపడొద్దని, ధైర్యంగా ముందడుగు వేయాలని, పతకాలు వాటంతట అవే వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. మేరీ కోమ్, పీవీ సింధు, ప్రవీణ్‌ జాదవ్‌, శరత్‌ కమల్‌, సానియా మీర్జా, దీపికా కుమారి, నీరజ్ చోప్రా తదితరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కరోనా నేపథ్యంలో అథ్లెట్లంతా అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలని, ఆటపై మనసు పెట్టి, 100 శాతం విజయం కోసం ప్రయత్నించాలని ఆకాంక్షించారు. కాగా, 119 మందితో కూడిన భారత అథ్లెట్ల బృందం మొత్తం 85 విభాగాల్లో పోటీపడనుంది. ఇందులో 67 మంది పురుషులు, 52 మంది మహిళలున్నారు. 

మరిన్ని వార్తలు