మన క్రీడాకారులకు మీ అండదండలు కావాలి

28 Jun, 2021 06:27 IST|Sakshi

యావత్‌ జాతి మద్దతుగా నిలవాలన్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కష్టనష్టాలను ఓర్చి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన భారత క్రీడాకారులకు యావత్‌ జాతి మద్దతు తెలపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’లో ఆయన క్రీడాకారుల గురించి వారి నేపథ్యం, పడ్డ కష్టాలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ప్రతీ క్రీడాకారుడిది ప్రత్యేక గాథ. దేశానికి ప్రాతినిధ్యం కోసం... పతకం కోసం వారంతా శ్రమైక జీవనంలో ఏళ్ల పాటు గడిపారు. వారి పయనం కేవలం పతకం కోసమే కాదు... దేశం కోసం. జాతి గర్వపడే విజయాల కోసం, ఈ ప్రయత్నంలో ప్రజల మనసులు గెలిచేందుకు టోక్యో వెళుతున్నారు. వాళ్లంతా విజయవంతమయ్యేందుకు మనమంతా వెన్నుదన్నుగా నిలవాల్సిన తరుణమిది. ప్రతి ఒక్క భారతీయుడు వారికి మనస్ఫూర్తిగా మద్దతు తెలపాలని నేను కోరుతున్నాను’ అని మోదీ అన్నారు. ఆర్చర్లు దీపిక కుమారి, ప్రవీణ్‌ జాదవ్, హాకీ క్రీడాకారిణి నేహా గోయెల్, బాక్సర్‌ మనీశ్‌ కౌశిక్, రేస్‌ వాకర్‌ ప్రియాంక గోస్వామి, జావెలిన్‌ త్రోయర్‌ శివపాల్‌ సింగ్, తెలుగు షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ అతని భాగస్వామి చిరాగ్‌ షెట్టి టోక్యో ఒలింపిక్స్‌ అర్హత కోసం కఠోరంగా శ్రమించారని ప్రధాని కితాబిచ్చారు. టోక్యో ఒలింపిక్స్‌ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి.  

మరిన్ని వార్తలు