ఆ క్యాచ్‌కు ప్రధాని కూడా ఫిదా అయ్యాడు..

11 Jul, 2021 21:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళా ఆల్‌రౌండర్ హర్లీన్ డియోల్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా చేరారు. గత శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హర్లీన్ డియోల్ బౌండరీ లైన్ వద్ద పురుష క్రికెటర్లను తలదన్నే రీతిలో బంతిని ఒడిసి పట్టుకొని ఔరా అనిపించింది. ఈ సూపర్ డూపర్ క్యాచ్‌పై దిగ్గజ క్రికెటర్లు, ఆనంద్ మహీంద్ర వంటి బిజినెస్ టైకూన్స్ ప్రశంసలు కురిపించారు.  తాజాగా ప్రధాని మోదీ సైతం ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు ఫిదా అయ్యానన్నారు. తన ఇన్‌స్టా స్టోరీలో అసాధారణ క్యాచ్ అంటూ హర్లీన్ డియోల్‌‌ను ప్రశంసించారు.


ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా శిఖా పాండే వేసిన 19 ఓవర్‌లో అమీ జోన్స్‌ (43 ) ఆడిన భారీ షాట్‌ను లాంగాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న హర్లీన్‌ డియోల్‌ అత్యద్భుతమైన రీతిలో క్యాచ్‌ అందుకుంది. తల మీదుగా వస్తున్న క్యాచ్‌ను ఎడమవైపు గాల్లోకి డైవ్‌ చేసి అందుకొంది. ఈ క్రమంలో బౌండరీ అవతల పడిపోతానని తెలుసుకొని బంతిని గాల్లోకి విసిరింది. బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ గాల్లోని బంతిని అందుకొనేందుకు మైదానంలోకి డైవ్‌ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

పురుష క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఫిట్‌నెస్, క్రీడా నైపుణ్యం సాధించారంటూ మెచ్చుకుంటున్నారు. మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ ఈ ఒక్క క్యాచ్‌తో హర్లీన్ ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకోగలిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఏడాది ఇదే అత్యుత్తమ క్యాచ్ అని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. క్రికెట్ మైదానంలో చూసిన క్యాచ్‌లలో ఇదొక గొప్ప క్యాచ్, టాప్‌ క్లాస్‌ ఫీల్డింగ్ అంటూ కామెంట్‌ చేశాడు.

>
మరిన్ని వార్తలు