Wrestler Sushil Kumar: ఆ రాత్రి ఏం జరిగింది?

26 May, 2021 02:25 IST|Sakshi

సుశీల్‌తో ఘటనా స్థలం వద్ద  పోలీసుల సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

 జైలులో కొనసాగుతున్న విచారణ

 ఉద్యోగం నుంచి తొలగించిన రైల్వేస్‌

‘రెండు వర్గాల మధ్య ఘర్షణను అడ్డుకునేందుకు మధ్యవర్తిగా మాత్రమే నేను అక్కడకు వెళ్లాను’... పోలీసుల విచారణ సందర్భంగా సుశీల్‌ కుమార్‌ ఇచ్చిన వాంగ్మూలం ఇది. అయితే అతను చెబుతున్న మాటల్లో నిజమెంత...? విచారణ సమయంలో పలుమార్లు మాట మార్చిన సుశీల్‌లో ఆ తడబాటు ఎందుకు...? ఇప్పుడు పోలీసులు ఇవన్నీ తేల్చే పనిలో పడ్డారు. సుశీల్‌ అరెస్ట్‌ అనంతరం ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ తమ పనిలో మరింత వేగం పెంచగా... స్వయంకృతంతో జైల్లో స్టార్‌ ఒలింపియన్‌ రెజ్లర్‌ కుమిలిపోతుండటం క్రీడా విషాదం. 

న్యూఢిల్లీ: యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు చురుగ్గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సుశీల్‌ కుమార్‌తో కలిసి మంగళవారం పోలీసులు ఘటన జరిగిన ఛత్రశాల్‌ స్టేడియం వద్దకు వెళ్లారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ‘సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌’ ద్వారా మే 4 రాత్రి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ‘ఘటన జరిగిన రోజు అతను ఎక్కడ ఉన్నాడు. ఏం చేశాడని ప్రశ్నించాం.

అనంతరం సుశీల్‌ దాక్కునేందుకు సహకరించిన సన్నిహితులు, మిత్రుల వివరాలు కూడా అడిగాం. మేం అన్ని కోణాల్లో విచారించి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం’ అని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఛత్రశాల్‌ స్టేడియంతో పాటు వివాదానికి కారణమైన మోడల్‌ హౌస్‌లోని ఫ్లాట్‌కు, షాలిమార్‌ బాగ్‌లో సుశీల్‌ నివాసం ఉంటున్న చోటుకు కూడా అతడిని పోలీసులు తీసుకెళ్లి పలు వివరాలు సేకరించారు. ‘ఆ రోజు రాత్రి సుశీల్‌తో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటున్నాం. అతను సాగర్‌ను కొడుతున్నట్లుగా వచ్చిన వీడియోపై మరింత స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నాం’ అని అధికారులు చెప్పారు.  

పొంతన లేని జవాబులు
మంగళవారం కూడా నాలుగు గంటలపాటు సుశీల్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో అతను భిన్నమైన సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ‘విచారణ సందర్భంగా ఒకసారి సాగర్, సోనూలను తాను అక్కడకు లాక్కు రాలేదని,  తగవు తీర్చేందుకు మాత్రమే వెళ్లానని అతను మాతో చెప్పాడు. మరోసారి దీని గురించే చెబుతూ తాను సాగర్‌ను కాస్త బెదిరించి భయపెట్టాలని మాత్రమే భావించానని కూడా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే అతని జవాబుల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది.

సహజంగానే ఆందోళన గా ఉన్న సుశీల్‌ పదే పదే మాట మార్చాడు. గొడవ జరిగాక కూడా తాను ఛత్రశాల్‌ స్టేడియం లోనే ఉన్నానని, మరుసటి రోజు సాగర్‌ చనిపోయాడని తెలిశాకే పారిపోయానని మాతో చెప్పాడు’ అని క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అంతటి పహిల్వాన్‌ కూడా జైలు గోడల మధ్య కన్నీళ్లు కార్చినట్లు ఆయన చెప్పారు. ‘లాకప్‌లో పెట్టగానే సుశీల్‌ ఏడ్చేశాడు. రాత్రంతా మెలకువతోనే ఉండి పలుమార్లు కన్నీళ్లు పెట్టుకున్న అతను ఏమీ తినేందుకు ఇష్టపడలేదు’ అని కూడా ఆయన వివరించారు.  

‘పద్మశ్రీ’ వెనక్కి తీసుకుంటారా... 
హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్‌కు 2011 లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ని వెనక్కి తీసుకునే విషయంలో చర్చ సాగుతోంది. గతంలో ఇలాంటి ఆరోపణలు ఏ అవార్డీపై రాలేదు కాబట్టి దీని విషయంలో ప్రభు త్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావి స్తోంది. అవార్డు నిబంధనల్లో ఇలా వెనక్కి తీసుకునే విషయంలో ఎలాంటి స్పష్టమైన సూచనలు లేకపోయినా... అవార్డు గ్రహీతలు నైతికపరంగా ఉన్నతంగా ఉండాలనే కోణంలో భారత రాష్ట్రపతి కి మాత్రం అవార్డును రద్దు చేసే అధికారం ఉంది.  

నార్నర్త్‌ రైల్వేస్‌ సస్పెన్షన్‌ వేటు
ఊహించినట్లుగానే నార్తర్న్‌ రైల్వే సుశీల్‌ను సస్పెండ్‌ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా అతను పని చేస్తున్నాడు. ‘సుశీల్‌పై క్రిమినల్‌ కేసు నమోదు కావడంతోపాటు 48 గంటలకు మించి అతను పోలీస్‌ కస్టడీలో ఉన్నాడు. నిబంధనల ప్రకారం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సుశీల్‌ను సస్పెండ్‌ చేస్తున్నాం’ అని నార్తర్న్‌ రైల్వేస్‌ అధికారికంగా ప్రకటించింది.  

కాంట్రాక్ట్‌ ఖతమ్‌! 
మరోవైపు సుశీల్‌ను భారత రెజ్లింగ్‌ సమాఖ్య కాంట్రాక్ట్‌ జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. తాజా ఘటనకంటే మ్యాట్‌పై అతని ప్రదర్శన కారణంగానే సుశీల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోనున్నాడు. 2019లో ‘ఎ’ గ్రేడ్‌ కాంట్రాక్ట్‌ (ఏడాదికి రూ. 30 లక్షలు) దక్కిన అనంతరం సుశీల్‌ ఆ తర్వాత ఆటలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 2018 ఆసియా క్రీడల్లో విఫలమైన సుశీల్‌... 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. ఆ తర్వాత అతను ఏ టోర్నమెంట్‌లోనూ పాల్గొనలేదు.

గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలపై కూడా..
మరోవైపు సుశీల్‌కు, జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ నీరజ్‌ బవానాకు మధ్య ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సుశీల్‌తో కలిసి దాడికి పాల్పడిన వారంతా బవానా మనుషులే అని భావిస్తున్న పోలీసులు ఈ కేసులో మరో ఏడుగురిని అనుమానితులుగా గుర్తించారు. ఘటనా స్థలం వద్ద దొరికిన ఒక స్కార్పియో ఎస్‌యూవీ వాహనం బవానా సన్నిహితుడిదేనని తేలింది. అన్నింటికిమించి కొన్నాళ్ల క్రితం వచ్చిన ఒక బెదిరింపు కేసులో కూడా సుశీల్‌ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరో గ్యాంగ్‌స్టర్‌ కాలా జఠేడితో సంబంధాలు బాగున్న సమయంలో ఇది జరిగింది. ఒక కేబుల్‌ ఆపరేటర్‌ను రూ. కోటి కోసం బెదిరించడం వెనక సుశీల్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ శివార్లలోని టోల్‌ గేట్లపై కూడా తమ పట్టు ఉంచుకునేందుకు జఠేడితో కలిసి సుశీల్‌ ప్రయత్నించినట్లు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు