Olympic Medal: పసిపాప కోసం ‘ఒలింపిక్‌ మెడల్‌’ వేలానికి, కానీ..

18 Aug, 2021 15:56 IST|Sakshi

ఆమె ఓ క్రీడాకారిణి.. కష్టపడి ఒలింపిక్స్‌లో పతకం సాధించి సత్తా చాటింది. పతకంతో ఇంటికి వెళ్లిన ఆమె సంబరాల్లో మునిగింది. ఈ సమయంలో ఓ పసిపాపకు ఆరోగ్యం బాగాలేదు.. పసికందు చికిత్సకు భారీగా ఖర్చవుతోందని తెలుసుకుని ఆమె తల్లడిల్లింది. దీంతో ఎంతో శ్రమకోర్చి సాధించిన తన ఒలింపిక్‌ పతకాన్ని వేలానికి పెట్టింది. ఆమె మానవత్వాన్ని మెచ్చి వేలం దక్కించుకున్న సంస్థ ఆమె మెడల్‌ను తిరిగి ఇచ్చేసింది. దీంతోపాటు పాప చికిత్సకు అయ్యే ఖర్చుకు డబ్బును కూడా సమకూర్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ( చదవండి: నీరజ్‌ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు)

పోలాండ్‌కు చెందిన మరియా అండ్రెజెక్‌ జావెలిన్‌ త్రోయర్‌ క్రీడాకారిణి. ఆమె తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంది. మన హీరో నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధించిన క్రీడ జావెలిన్‌ త్రో మహిళల విభాగంలో 64.61 మీటర్ల దూరం జావెలిన్‌ విసిరి మరియా రెండో స్థానంలో నిలిచింది. రజత పతకం సొంతం చేసుకుంది. అయితే ఆమెకు ఇటీవల 8 నెలల వయసున్న మలీసా అనే పాప అరుదైన వ్యాధి (గుండె సంబంధిత)తో బాధపడుతోందని తెలుసుకుని ఆవేదనకు లోనైంది. ఆ పాప చికిత్సకు అవసరమైన ఖర్చును తాను పెట్టలేని స్థితిలో ఉండడంతో తన రజత పతకాన్ని వేలం పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆమె చర్యను అందరూ అభినందించారు. కొందరు వేలం వద్దు.. మేం కొంత ఇస్తాం అని కామెంట్‌ చేశారు. అయితే ఆమె ప్రకటనతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చింది. ఏకంగా 1.25 లక్షల డాలర్ల వరకు విరాళాలు సమకూరాయి. ఇక పతకం వేలంలో పోలాండ్‌కు చెందిన సూపర్‌మార్కెట్‌ చెయిన్‌ సంస్థ జాబ్కా పోటీ పడింది. చివరకు వేలంలో ఆ సంస్థ మెడల్‌ను దక్కించుకుంది. అయితే ఆ సంస్థ మాత్రం మెడల్‌ తీసుకునేందుకు నిరాకరించింది. పాప చికిత్సకు అయ్యే డబ్బు ఇవ్వడంతో పాటు మరియా దక్కించుకున్న పతకాన్ని కూడా తిరిగి ఇచ్చేయాలని జాబ్క సంస్థ తెలిపింది. మానవత్వం చాటుకున్న మరియా ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌ను జయించింది. 2018లో బోన్‌ క్యాన్సర్‌తో బాధపడింది. క్యాన్సర్‌ను జయించడంతో ఇప్పుడు పోలాండ్‌ దేశానికి ఒలింపిక్స్‌లో కాంస్య పతకం తీసుకువచ్చింది. రియో ఒలింపిక్స్‌లో మరియాకు త్రుటిలో పతకం చేజారింది. 2 సెంటీ మీటర్ల దూరంలో మెడల్‌ ఆగిపోయింది. 


 

A post shared by Maria M. Andrejczyk (@m.andrejczyk)

మరిన్ని వార్తలు