Asian Boxing Championship: పూజా పసిడి పంచ్‌ 

31 May, 2021 01:57 IST|Sakshi

ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ నిలబెట్టుకున్న భారత బాక్సర్‌

రజత పతకాలు నెగ్గిన మేరీకోమ్, లాల్‌బుత్సాహి, అనుపమ

దుబాయ్‌: నాలుగు పసిడి పతకాలు నెగ్గాలనే లక్ష్యంతో రింగ్‌లోకి అడుగుపెట్టిన భారత మహిళా బాక్సర్లు చివరకు ఒక స్వర్ణ పతకంతో సంతృప్తి పడ్డారు. ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఆరు కాంస్యాలు లభించాయి. ఆదివారం మహిళల విభాగంలో నాలుగు ఫైనల్స్‌లో పోటీపడ్డ భారత బాక్సర్లలో డిఫెండింగ్‌ చాంపియన్‌ పూజా రాణి (75 కేజీలు) మళ్లీ స్వర్ణం సొంతం చేసుకోగా... ఐదుసార్లు చాంపియన్‌ మేరీకోమ్‌ (51 కేజీలు), తొలిసారి ‘ఆసియా’ టోర్నీ లో ఆడిన లాల్‌బుత్సాహి (64 కేజీలు), అనుపమ (ప్లస్‌ 81 కేజీలు) రజత పతకాలు గెలిచారు. ఫైనల్లో పూజా రాణి 5–0తో మవ్లుదా మవ్లోనోవా (ఉజ్బెకిస్తాన్‌)పై గెలిచింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన పూజా రాణికి సెమీఫైనల్లో ‘వాకోవర్‌’ లభించింది.

పూజాకు స్వర్ణ పతకంతోపాటు 10 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షల 25 వేలు) లభించింది. ఇతర ఫైనల్స్‌లో మేరీకోమ్‌ 2–3తో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ నజీమ్‌ కిజైబే (కజకిస్తాన్‌) చేతిలో... లాల్‌బుత్సాహి 2–3తో మిలానా సఫ్రనోవా (కజకిస్తాన్‌) చేతిలో... అనుపమ 2–3తో లజత్‌ కుంగ్జిబయేవా (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయారు. మేరీకోమ్, లాల్‌బుత్సాహి, అనుపమాలకు రజత పతకాలతోపాటు 5 వేల డాలర్ల చొప్పున (రూ. 3 లక్షల 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. సెమీఫైనల్లో ఓడిన లవ్లీనా (69 కేజీలు), సిమ్రన్‌జిత్‌ (60 కేజీలు), జాస్మిన్‌ (57 కేజీలు), సాక్షి చౌదరీ (64 కేజీలు), మోనిక (48 కేజీలు), సవీటి బురా (81 కేజీలు) కాంస్య పతకాలు దక్కించుకున్నారు. నేడు జరిగే పురుషుల విభాగం ఫైనల్స్‌లో అమిత్‌ పంఘాల్‌ (52 కేజీలు), శివ థాపా (64 కేజీలు), సంజీత్‌ (91 కేజీలు) బరిలోకి దిగనున్నారు.

మరిన్ని వార్తలు