ఉన్నపళంగా ఫామ్‌ అందుకోలేం

26 Jul, 2020 06:59 IST|Sakshi

భారత స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ అభిప్రాయం

న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత ఉన్నపళంగా ఫామ్‌ను అందుకోవడం చాలా కష్టమని భారత మహిళల క్రికెట్‌ జట్టు లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ అభిప్రాయపడింది. వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్‌నకు ముందు భారత్‌ ఏకైక అంతర్జాతీయ టోర్నీలో ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. కరోనా కారణంగా అది కాస్తా రద్దు కావడంతో పూనమ్‌ నిరాశ వ్యక్తం చేసింది. చివరగా ఈ ఏడాది మార్చిలో టి20 ప్రపంచకప్‌లో తలపడిన భారత్‌ కరోనా కారణంగా నాలుగు నెలలుగా ప్రాక్టీస్‌కు దూరమైంది. తాజాగా ఇంగ్లండ్‌ టూర్‌ కూడా ఆగిపోవడంతో నేరుగా వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటాలంటే అంత సులువు కాదని పూనమ్‌ పేర్కొంది.

న్యూజిలాండ్‌ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో జరగాల్సిన ఈ మెగా టోర్నీ భవితవ్యంపై రానున్న రెండు వారాల్లో స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించింది. ‘ఇదో కఠిన సవాల్‌. నాలుగైదు నెలల విరామానంతరం మునుపటి ఫామ్‌ కొనసాగించలేం. చివరగా మార్చిలో బరిలో దిగాం. ఇప్పటికీ మేం ఆడబోయే తదుపరి సిరీస్‌పై స్పష్టత లేదు. ఒకవేళ అనుకున్న సమయానికి వన్డే ప్రపంచకప్‌ జరిగితే సన్నద్ధతకు సమయమే ఉండదు’ అని భారత్‌ తరఫున ఒక టెస్టు, 46 వన్డేలు, 67 టి20లు ఆడిన పూనమ్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు