క్వాలిఫయింగ్‌లో హామిల్టన్‌కు నిరాశ

2 May, 2021 03:38 IST|Sakshi
బొటాస్, హామిల్టన్‌

బొటాస్‌కు పోల్‌ పొజిషన్‌

నేడు పోర్చుగల్‌ గ్రాండ్‌ప్రి

రాత్రి గం.7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–3లో ప్రత్యక్షప్రసారం  

పోర్టిమావో (పోర్చుగల్‌): కెరీర్‌లో 100వ పోల్‌ పొజిషన్‌ సాధించేందుకు డిఫెండింగ్‌ చాంపియన్, మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరో వారం రోజులు వేచి చూడాలి. తాజా ఫార్ములావన్‌ సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన పోర్చుగల్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో హామిల్టన్‌ రెండో స్థానంలో నిలిచాడు. గత రెండు రేసుల్లో నిరాశ పరిచిన మెర్సిడెస్‌ జట్టుకే చెందిన మరో డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ మాత్రం ఈ క్వాలిఫయింగ్‌ సెషన్‌లో అదరగొట్టాడు.

అందరికంటే వేగంగా ల్యాప్‌ను నిమిషం 18.348 సెకన్లలో పూర్తి చేసి పోల్‌ పొజిషన్‌ను సొంతం చేసుకున్నాడు. అతడి కెరీర్‌లో ఇది 17వ పోల్‌. ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్‌ తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ మూడో స్థానంలో నిలిచాడు. సీజన్‌లో ఇప్పటి వరకు మూడు క్వాలిఫయింగ్‌ సెషన్‌లు జరగ్గా... ఈ మూడు సార్లు వేర్వేరు డ్రైవర్లు పోల్‌ పొజిషన్‌ను దక్కించుకున్నారు. బహ్రెయిన్‌లో వెర్‌స్టాపెన్, ఇమోలా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌లు పోల్‌ పొజిషన్‌తో మెరిశారు.

గ్రిడ్‌ పొజిషన్స్‌
1. బొటాస్‌ (మెర్సిడెస్‌), 2. హామిల్టన్‌ (మెర్సిడెస్‌), 3. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌), 4. పెరెజ్‌ (రెడ్‌బుల్‌), 5. సెయింజ్‌ (ఫెరారీ), 6. ఒకాన్‌ (ఆల్పైన్‌), 7. నోరిస్‌ (మెక్‌లారెన్‌), 8. లెక్‌లెర్క్‌ (ఫెరారీ), 9, గ్యాస్లీ (ఆల్ఫా టారీ), 10. వెటెల్‌ (ఆస్టన్‌ మార్టిన్‌), 11. రసెల్‌ (విలియమ్స్‌), 12. జియోవినాజి (ఆల్ఫా రోమియో), 13. అలోన్సో (ఆల్పైన్‌), 14, సునోడా (ఆల్ఫా టారీ), 15. రైకొనెన్‌ (ఆల్ఫా రోమియో), 16. రికియార్డో (మెక్‌లారెన్‌) 17. స్ట్రోల్‌ (ఆస్టన్‌ మార్టిన్‌), 18. లతీఫ్‌ (విలియమ్స్‌), 19. మిక్‌ షుమాకర్‌ (హాస్‌), 20. మేజ్‌పిన్‌ (హాస్‌)
 

మరిన్ని వార్తలు