Prabath Jayasuriya: అక్షర్‌ పటేల్‌ రికార్డు బద్దలు కొట్టిన లంక స్పిన్నర్‌

28 Jul, 2022 17:30 IST|Sakshi

పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు పడగొట్టడం ద్వారా లంక స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్ట్‌ కెరీర్‌లో తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భారత మాజీ లెగ్‌ స్పిన్‌ బౌలర్‌ నరేంద్ర హిర్వాని (31 వికెట్లు, తొలి టెస్ట్‌లోనే విండీస్‌పై 16 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ప్రభాత్‌ (29) ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ చార్లెస్‌ టర్నర్‌ (29)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.  

ఈ క్రమంలో ప్రభాత్‌.. టీమిండియా లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ (27) రికార్డును కూడా అధిగమించాడు. పాక్‌తో రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభాత్‌.. మరో రికార్డను కూడా సంయుక్తంగా షేర్‌ చేసుకున్నాడు. తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు 5 వికెట్ల ఘనతలు సాధించిన బౌలర్‌గా అక్షర్‌ పటేల్‌తో సమంగా నిలిచాడు.

అరంగేట్రం టెస్ట్‌లో 12  వికెట్లు (6/118, 6/59) నేలకూల్చి లంక తరఫున డెబ్యూ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పిన ప్రభాత్‌.. ఆ తర్వాత పాక్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 9 వికెట్లు (5/82, 4/135), తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు (3/80, 5/117) సాధించాడు. ఆడిన 3 మ్యాచ్‌ల్లో తన జట్టును రెండు సార్లు గెలిపించిన ప్రభాత్‌.. ప్రస్తుత ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ బ్యాటర్లందరినీ (రూట్‌ మినహా) ఔట్‌ చేశాడు.

వరల్డ్‌ నంబర్‌ 2 బ్యాటర్‌ లబూషేన్‌ను రెండుసార్లు, నంబర్‌ 3 ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ను రెండుసార్లు, స్టీవ్‌ స్మిత్‌ను ఒక్కసారి (డకౌట్‌) పెవిలియన్‌కు పంపాడు. 30 ఏళ్ల లేటు వయసులో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్‌.. తన వైవిధ్యమైన స్పిన్‌ మాయాజాలంతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ప్రత్యర్ధుల పాలిట సింహస్వప్నంలా మారాడు. వికెట్లు సాధించడంతో పాటు జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషిస్తూ ప్రస్తుతం టెస్ట్‌ క్రికెట్‌లో నయా సెన్సేషన్‌గా మారాడు.


చదవండి: రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాక్‌ను మట్టికరిపించిన లంకేయులు


 

మరిన్ని వార్తలు