ప్రపంచ చాంపియన్‌షిప్‌పై కసరత్తు

16 Aug, 2022 05:13 IST|Sakshi

భారత షట్లర్‌ ప్రణయ్‌  

న్యూఢిల్లీ: జపాన్‌లాంటి కోర్టుల్లో ఆడాలంటే చాలా ఓపిక కావాలని భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ అన్నాడు. త్వరలో అక్కడ జరగనున్న బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ కోసం కసరత్తు చేస్తున్నానని చెప్పాడు. ‘నేను రెండు వారాలుగా ప్రాక్టీస్‌ చేస్తున్నాను. ఎప్పట్లా రొటిన్‌గానే సన్నద్ధమవుతున్నా. నా ప్రాక్టీస్‌లో తేడా ఏమీ లేదు. కానీ టోక్యోలోని బ్యాడ్మింటన్‌ కోర్టులు మందకొడిగా ఉంటాయి. అక్కడ ఆడాలంటే నేర్పుంటే చాలదు. చాలా ఓర్పు కావాలి. అందుకే నేను ఆటతీరులో సహనం, సంయమనంపై దృష్టిపెట్టాను’ అని అన్నాడు.

ఈ నెల 22 నుంచి టోక్యోలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలు జరుగనున్నాయి. స్పెయిన్‌లో జరిగిన గత మెగా ఈవెంట్‌లో ప్రణయ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరాడు. ఈ సీజన్‌లో నిలకడగా ఆడుతున్న అతను ర్యాంకు మెరుగుపర్చుకునే పనిలో పడ్డాడు. ‘ర్యాంకుల్లో ఎగబాకడం ఇప్పుడు అంత సులభం కాదు. ఒక్క రేటింగ్‌ పాయింట్‌ కూడా కీలకమే. నేను మళ్లీ టాప్‌–20 ర్యాంకుల్లోకి రావాలంటే ఒక్కో టోర్నీలో నిలకడగా క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్‌ చేరుతుండాలి. అప్పుడు అనుకున్న ర్యాంకుకు చేరుకోగలం’ అని అన్నాడు.

ఒకానొక దశలో చక్కని ఆటతీరుతో ప్రపంచ ఎనిమిదో ర్యాంకుకు ఎగబాకిన ప్రణయ్‌ని 2020 నవంబర్లో కోవిడ్‌ దెబ్బతీసింది. మహమ్మారి అతని ప్రదర్శనపై పెను ప్రభావమే చూపింది. ఆ తర్వాత ‘గో స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌’ సహకారంతో ఆరోగ్యాన్ని, తర్వాత ఫిట్‌నెస్‌ను మెల్లిగా ఆటతీరును మెరుగుపర్చుకున్నాడు. ఈ సీజన్‌లో ఇండోనేసియా, మలేసియా ఓపెన్‌లలో సెమీస్‌ చేరిన ప్రణయ్‌ స్విస్‌ ఓపెన్‌లో రన్నరప్‌తో తృప్తి చెందాడు. థామస్‌ కప్‌ విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. అయితే పెద్ద పెద్ద ఎండార్స్‌మెంట్లు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులుంటున్నాయని, మేజర్‌ టోర్నీల్లో గెలిస్తేనే బ్రాండింగ్‌ దక్కుతుందని చెప్పాడు.

మరిన్ని వార్తలు