Praveen Kumar Sobti: స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచిన అథ్లెట్‌.. భీముడిగా గుర్తింపు.. ప్రవీణ్‌ కుమార్‌ ఘనతలు ఇవీ!

9 Feb, 2022 08:10 IST|Sakshi

‘భీముడు’ కన్నుమూశాడు

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన భారత అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌

ఆసియా క్రీడల్లో నాలుగు పతకాలు

రెండుసార్లు ఒలింపిక్స్‌లో పోటీ

Praveen Kumar Sobti:- న్యూఢిల్లీ: భారత క్రీడల్లో విజేయుడు...  ‘మహాభారత్‌’లో భీముడు ప్రవీణ్‌ కుమార్‌ సోబ్టీ కన్నుమూశారు. 74 ఏళ్ల ప్రవీణ్‌ సోమవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. పంజాబ్‌కు చెందిన ప్రవీణ్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో డిస్కస్‌ త్రో, హ్యామర్‌ త్రో ఈవెంట్లలో పతకాలు నెగ్గిన ఈ అలనాటి దిగ్గజం ఓ క్రీడాకారుడిగా కంటే విలక్షణ నటుడిగా సుపరిచితం.

ఇప్పుడు ఒక్క కాంస్య పతకంతోనే రాత్రికి రాత్రే స్టార్‌ అవుతుండగా... ఆ కాలంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో విజయవంతమైన అథ్లెట్‌గా ఎదిగారు. అయినప్పటికీ క్రీడల్లో రాని గుర్తింపు, పేరు ప్రతిష్టలు ఒక్క ‘మహాభారత్‌’ సీరియల్‌తోనే వచ్చాయి. 

ఇవీ ఆయన ఘనతలు 
అమృత్‌సర్‌లో 1947 డిసెంబర్‌ 6న పుట్టిన ప్రవీణ్‌ 1960 నుంచి 1974 వరకు పలు మెగా ఈవెంట్లలో పతకాలతో మెరిశారు.
1966 బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో డిస్కస్‌ త్రోలో చాంపియన్‌గా నిలిచిన ప్రవీణ్‌ హ్యామర్‌ త్రోలో కాంస్యం నెగ్గారు.
అదే ఏడాది కింగ్‌స్టన్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో హ్యామర్‌ త్రోలో రజతం గెలుపొందారు.


1970 బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో డిస్కస్‌ త్రో ఈవెంట్‌లో టైటిల్‌ నిలబెట్టుకున్న ప్రవీణ్‌ 1974 టెహ్రాన్‌ ఆసియా క్రీడల్లో రజతం గెలిచారు.
1968 మెక్సికో, 1972 మ్యూనిక్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లోనూ ప్రవీణ్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.   

భారతంలో భీముడు
దూరదర్శన్‌లో 90వ దశకంలో ప్రసారమైన సుప్రసిద్ధ పౌరాణిక ధారావాహిక ‘మహాభారత్‌’లో పంచ పాండవుల్లో భీముడిగా ప్రవీణ్‌ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. తదనంతరం పలు హిందీ, తమిళ్, తెలుగు చిత్రాల్లో  నటించారు. 2013లో రాజకీయాల్లోనూ ప్రవేశించి ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీలోని వాజిర్‌పూర్‌ అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు.

చదవండి: IND VS WI 2nd ODI: విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. సచిన్‌, ధోని సరసన..! 

మరిన్ని వార్తలు