#PreityZinta: ట్రాక్‌లో పడాలంటే ఆలు పరోటాలు చేయాల్సిందేనా!

29 Apr, 2023 17:04 IST|Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా  శుక్రవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 56 పరుగులు తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 258 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని చేధించే క్రమంలో పంజాబ్‌ పోరాటం 201 పరుగుల వద్ద ముగిసింది. అయితే పంజాబ్‌ తరపున 33 బంతుల్లో 66 పరుగులు చేసిన అథర్వ తైదే మాత్రం ఆకట్టుకున్నాడు. 

ఇక ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జ‌ట్టు సహ యజమాని ప్రీతి జింటా అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలి ఎడిషన్‌ నుంచి ఉన్న పంజాబ్‌ కింగ్స్‌(కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌) టైటిల్‌ కోరిక మాత్రం నెరవేరలేదు.  మరి ఈసారైనా పంజాబ్‌ కింగ్స్‌ టైటిల్‌ కొట్టి ప్రీతి జింటా కోరిక నెరవేరుస్తుందేమో చూడాలి.

తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రీతి గతంలో జరిగిన ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెప్పింది. త‌మ జ‌ట్టు ప్లేయ‌ర్ల కోసం 120 ప‌రోటాలు చేసిన‌ట్లు గుర్తు చేసింది. స్టార్ స్పోర్ట్స్ యాంక‌ర్ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. అబ్బాయిలు ఇంతలా తినంటార‌న్న విష‌యం త‌న‌కు అప్పుడే తెలిసింద‌ని పేర్కొంది.

2009లో ఐపీఎల్ సౌతాఫ్రికాలో జ‌రిగింది. అక్క‌డ త‌మ ప్లేయ‌ర్ల‌కు మంచి ప‌రోటాలు దొర‌క‌లేద‌ని, ప‌రోటాలు చేయ‌డం మీకు నేర్పిస్తాన‌ని ప్రీతి అన్నారు. అయితే త‌మ‌కు ఆలూ ప‌రోటాలు కావాల‌ని ప్లేయ‌ర్లు అడిగార‌ని, వ‌చ్చే మ్యాచ్ గెలిస్తే ప‌రోటాలు చేసి ఇస్తాన‌ని ప్రీతి హామీ ఇచ్చింది. ఇక‌ పంజాబీ జ‌ట్టు ఆ మ్యాచ్‌ను నెగ్గింది. దీంతో ప్రీతి స్వ‌యంగా 120 ప‌రోటాలు చేసిన ప్లేయ‌ర్ల‌కు ఇచ్చింది. ప్రీతి ఇచ్చిన స‌మాధానం విన్న హ‌ర్భ‌జ‌న్‌.. ఇర్ఫాన్ ప‌ఠాన్ ఒక్క‌డే 20 ప‌రోటాలు తిన్న‌ట్లు చెప్పాడు. చివర్లో మా జట్టు ట్రాక్‌లో పడాలంటే మళ్లీ ఆలు పరోటాలు చేయాలేమో అని ప్రీతి జింటా అనడంతో నవ్వులు విరపూశాయి.

చదవండి: పంజాబ్‌ ఓడినా తాను గెలిచాడు.. ఎవరీ అథర్వ తైదే?

మరిన్ని వార్తలు