National Sports Awards 2021: ‘ఖేల్‌ రత్నా’లకు పట్టాభిషేకం..

14 Nov, 2021 08:18 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో తమ ప్రతిభాపాటవాలతో దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్న భారత మేటి క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా పురస్కారాలతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్‌లో శనివారం కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా 2021 సంవత్సరానికిగాను క్రీడాకారులు ఈ అవార్డులు అందుకున్నారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న’కు ఈసారి ఏకంగా 12 మందిని ఎంపిక చేశారు.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన నీరజ్‌ చోప్రా (అథ్లెటిక్స్‌), రవి దహియా (రెజ్లింగ్‌), లవ్లీనా (బాక్సింగ్‌)... 44 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్, గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌... పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అవనీ లేఖరా (పారా షూటింగ్‌), మనీశ్‌ నర్వాల్‌ (పారా షూటింగ్‌), సుమిత్‌ అంటిల్‌ (పారా అథ్లెటిక్స్‌), ప్రమోద్‌ భగత్‌ (పారా బ్యాడ్మింటన్‌), కృష్ణ నాగర్‌ (పారా బ్యాడ్మింటన్‌)... 22 ఏళ్లుగా భారత మహిళల క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్, 19 ఏళ్లుగా భారత ఫుట్‌బాల్‌ జట్టుకు ఆడుతున్న కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రిలకు ‘ఖేల్‌ రత్న’తో గౌరవించారు.

‘ఖేల్‌ రత్న’ అవార్డీలకు రూ. 25 లక్షల చొప్పున ప్రైజ్‌మనీతోపాటు పతకం, ప్రశంసాపత్రం అందజేశారు. ‘అర్జున అవార్డు’ను అత్యధికంగా 35 మందికి అందజేశారు. ఇందులో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత హాకీ జట్టు సభ్యులు 15 మంది, నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు నుంచి ఇద్దరు ఉన్నారు. స్టార్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌తోపాటు భారత మహిళల టెన్నిస్‌ నంబర్‌వన్‌ అంకిత రైనా కూడా ‘అర్జున’  అందుకున్న వారిలో ఉన్నారు. ‘అర్జున’ అవార్డీలకు రూ. 15 లక్షల ప్రైజ్‌మనీ, ప్రతిమ, ప్రశంసాపత్రం ఇచ్చారు. ఉత్తమ కోచ్‌లకు ఇచ్చే ‘ద్రోణాచార్య’ అవార్డును లైఫ్‌టైమ్‌ కేటగిరీలో ఐదుగురికి... రెగ్యులర్‌ విభాగంలో ఐదుగురికి అందజేశారు.

చదవండి: Matthew Wade: క్యాన్సర్‌ బారిన పడ్డ మాథ్యూ వేడ్.. ప్లంబర్‌గా, కార్పెంటర్‌గా.. చివరకు...

మరిన్ని వార్తలు