Prime Volleyball League 2023: వాలీబాల్‌ లీగ్‌కు వేళాయె...

4 Feb, 2023 04:51 IST|Sakshi
ట్రోఫీతో ఎనిమిది జట్ల కెప్టెన్‌లు

నేడు బెంగళూరులో ప్రారంభం

బరిలో ఎనిమిది జట్లు

హైదరాబాద్, కొచ్చిలోనూ మ్యాచ్‌లు

మార్చి 5న టైటిల్‌ పోరు

బెంగళూరు: గత ఏడాది వాలీబాల్‌ ప్రియుల్ని అలరించిన ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) ఇప్పుడు రెండో సీజన్‌తో మరింత ప్రేక్షకాదరణ పొందాలని ఆశిస్తోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే సీజన్‌–2 పోటీల్లో ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు కోల్‌కతా థండర్‌బోల్ట్స్, హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్, కొచ్చి బ్లూ స్పైకర్స్, కాలికట్‌ హీరోస్, అహ్మదాబాద్‌ డిఫెండర్స్, బెంగళూరు టొర్పెడోస్, చెన్నై బ్లిట్జ్, ముంబై మిటియోర్స్‌ ‘ఢీ’కి రెడీ అయ్యాయి.

డిఫెండింగ్‌ చాంపియన్స్‌ కోల్‌కతా థండర్‌బోల్ట్స్‌ తమ జోరు ఈ సీజన్‌లోనూ కొనసాగించేందుకు ఉత్సాహంగా ఉంది. ముందుగా శనివారం నుంచి లీగ్‌ దశలో 28 మ్యాచ్‌లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మార్చి 3, 4 తేదీల్లో సెమీఫైనల్స్‌ పోటీలు నిర్వహిస్తారు. 5న విజేతను తేల్చే ఫైనల్‌ పోరుతో టోర్నీ ముగుస్తుంది. బెంగళూరులో నేడు కోల్‌కతా థండర్‌బోల్ట్స్, బెంగళూరు టొర్పెడోస్‌ల మధ్య ఆరంభ మ్యాచ్‌ జరుగుతుంది.

ఈ నెల 12 నుంచి 21 వరకు హైదరాబాద్‌ వేదికగా 11 మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం మిగిలిన లీగ్‌ దశ సహా సెమీస్, ఫైనల్‌ దాకా కొచ్చిలోనే మ్యాచ్‌ల్ని నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు క్లబ్‌ వాలీబాల్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈసారి, వచ్చే ఏడాది క్లబ్‌ వాలీబాల్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ భారత్‌లోనే జరుగనుండటంతో మరో విశేషం.  

మరిన్ని వార్తలు