రంజీల్లో పృథ్వీ షా చరిత్ర.. నా రికార్డు బ్రేక్‌! థ్రిల్‌ అయ్యా.. ఎవరికీ అందనంత ఎత్తులో!

11 Jan, 2023 14:34 IST|Sakshi

Prithvi Shaw Triple Century- Rare Record: ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న టీమిండియా యువ ఓపెనర్‌ పృథ్వీ షా గురించి మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ముంబై బ్యాటర్‌ తన అభిమాన ఆటగాడని.. అతడే తన రికార్డును బద్దలు కొట్టడం సంతోషంగా ఉందన్నాడు. రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో భాగంగా అసోంతో మ్యాచ్‌లో పృథ్వీ షా అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.

రెండో రోజు ఆటలో భాగంగా ఈ ముంబైకర్‌ ట్రిపుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 379 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కొద్దిలో క్వాడ్రపుల్‌ సెంచరీ మిస్‌ అయినా.. కెరీర్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు.

రంజీల్లో సరికొత్త చరిత్ర
ఈ క్రమంలో రంజీ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. బాంబే ప్లేయర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ను అధిగమించి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానానికి దూసుకువచ్చాడు. అరుదైన ఘనత సాధించి తన సమకాలీన క్రికెటర్లకు అందనంత ఎత్తుకు ఎదిగాడు 23 ఏళ్ల ఈ టీమిండియా ఓపెనర్‌.

ఈ నేపథ్యంలో పృథ్వీని అభినందిస్తూ.. సంజయ్‌ మంజ్రేకర్‌ ట్వీట్‌ చేశాడు. ‘‘377 పరుగులతో నేను సృష్టించిన రికార్డును.. నేను అభిమానించే ఆటగాడు బద్దలు కొట్టడం చూసి థ్రిల్‌ అయ్యాను. వెల్‌డన్‌ పృథ్వీ!’’ అని ఈ యువ ఆటగాడిని ప్రశంసించాడు.

రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన టాప్‌-5 క్రికెటర్లు
1. బీబీ నింబాల్కర్ (మహారాష్ట్ర) – 443 నాటౌట్ (vs) సౌరాష్ట్ర (1948-49)
2. పృథ్వీ షా (ముంబై) – 379 (vs) అసోం (2022-23)
3. సంజయ్ మంజ్రేకర్ (బాంబే) – 377 (vs)హైదరాబాద్ (1990-91)
4. ఎంవీ శ్రీధర్ (హైదరాబాద్) – 366 (vs) ఆంధ్ర (1993-94)
5. విజయ్ మర్చంట్ (బాంబే) – 359 నాటౌట్(vs) మహారాష్ట్ర (1943-44)

చదవండి: Ind Vs SL: ఇలాంటి ఆటగాడిని చూడలేదు.. ఆ ప్రేమ నిజం! కోహ్లి ప్రశంసల జల్లు
IPL 2023-Rishabh Pant: పంత్‌ లేని లోటు ఎవరూ తీర్చలేరు.. అయితే: గంగూలీ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు