Prithvi Shaw: ఏకైక భారత ఆటగాడిగా పృథ్వీ షా.. ఈ రికార్డు కూడా తన ఖాతాలోనే! ఇప్పటికైనా..

12 Jan, 2023 10:29 IST|Sakshi

Ranji Trophy 2022-23- Prithvi Shaw అమిన్‌గావ్‌ (అస్సాం): జాతీయ జట్టులో పునరాగమనం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న ముంబై యువ క్రికెటర్‌ పృథ్వీ షా అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన విషయం విదితమే. అస్సాం జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో పృథ్వీ షా (383 బంతుల్లో 379; 49 ఫోర్లు, 4 సిక్స్‌లు) ‘ట్రిపుల్‌ సెంచరీ’ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో 23 ఏళ్ల పృథ్వీ షా 89 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్ర పుటల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.

ఈ మెగా టోర్నీ చరిత్రలో మహారాష్ట్ర క్రికెటర్‌ బి.బి.నింబాల్కర్‌ (443 నాటౌట్‌; 1948లో కతియావార్‌ జట్టుపై) తర్వాత రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా పృథ్వీ షా నిలిచాడు. అదే విధంగా ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో దేశవాళీ క్రికెట్‌లో అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.

ఏకైక భారత ఆటగాడిగా రికార్డు
రంజీ ట్రోఫీలో ‘ట్రిపుల్‌ సెంచరీ’... విజయ్‌ హజారే వన్డే టోర్నీలో ‘డబుల్‌ సెంచరీ’... ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో సెంచరీ చేసిన ఏకైక భారత క్రికెటర్‌గా పృథ్వీ షా గుర్తింపు పొందాడు.

రియాన్‌ బౌలింగ్‌లో..
ఇక ఈ రంజీ సీజన్‌లో పృథ్వీ ఇప్పటివరకు 539 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా బీసీసీఐ సెలక్టర్లు పృథ్వీ షాను జాతీయ జట్టుకు సెలక్ట్‌ చేస్తారా లేదంటే అన్యాయం చేస్తూనే ఉంటారా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా 2021 శ్రీలంక పర్యటన తర్వాత పృథ్వీ షాకు ఇంతవరకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఓవర్‌నైట్‌ వ్యక్తిగత స్కోరు 240తో బ్యాటింగ్‌ కొనసాగించిన పృథ్వీ మరో 139 పరుగులు సాధించి రియాన్‌ పరాగ్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 397/2తో ఆట కొనసాగించిన ముంబై ... కెప్టెన్‌ అజింక్య రహానే (191; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) అవుటవ్వగానే తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 687 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అస్సాం ఆట ముగిసే సమయానికి ఒక వికెట్‌ కోల్పోయి 129 పరుగులు చేసింది.    

చదవండి: Ind Vs NZ- Uppal: హైదరాబాద్‌లో వన్డే.. టికెట్ల ధరలు, పూర్తి వివరాలు! ఒక్కొక్కరికి ఎన్ని?
IND Vs SL: కోల్‌కతాలోనే సిరీస్‌ పడతారా?

మరిన్ని వార్తలు