Prithvi Shaw: 'గడిచిన 18 నెలలు కష్టకాలంగా అనిపించింది'

27 Jan, 2023 18:26 IST|Sakshi

టాలెంట్‌కు కొదువ లేకున్నా గాయాలు, అధిక బరువు, డోపింగ్‌లో పట్టుబడడం ఇలాంటివన్నీ పృథ్వీ షాను చాలా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు టీమిండియాలో ఉన్న ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌ల కంటే ముందే జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు పృథ్వీ షా. తాజాగా రంజీ ట్రోఫీలో ట్రిపుల్‌ సెంచరీతో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న పృథ్వీ షాను టీమిండియా తలుపు మరోసారి తట్టింది.

న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు అతను ఎంపికయ్యాడు. అయితే జట్టు కూర్పు దృశ్యా పృథ్వీ షాకు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. ఒకవేళ పృథ్వీని ఆడించాలనుకుంటే రాహుల్‌ త్రిపాఠిని తప్పించాల్సి ఉంటుంది. మరి పృథ్వీ షా తొలి టి20 ఆడతాడా లేదా అనేది మరికొద్ది సేపట్లో తెలియనుంది. 

టీమిండియాలోకి తిరిగి రావడంపై పృథ్వీ షా స్పందించాడు. మ్యాచ్‌కు ముందు బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్య్వులో పృథ్వీ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గడిచిన 18 నెలలు తనకు కష్టకాలంగా అనిపించిందని.. మళ్లీ టీమిండియాలోకి రావడం సంతోషం కలిగిస్తుందని పేర్కొన్నాడు.  పృథ్వీ షా మాట్లాడుతూ..''చాలా రోజులుగా నేను భారత జట్టుకు దూరంగా ఉన్నాను. మళ్లీ పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది. రాత్రి 10.30 సమయంలో జట్టును ప్రకటించారు. ఆ క్షణంలో నాకు చాలా ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయి. వాటి దెబ్బకు నా ఫోన్ హ్యాంగ్ అయ్యింది. దాంతో ఏం జరుగుతుందని కాస్త షాక్‌కు గురయ్యాను.

గత 18 నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న నాకు ఈ సమయం చాలా కఠినంగా గడిచింది. కానీ నాకు మద్దుతు ఇచ్చే వారు మాత్రం అండగా నిలిచారు. భారత్ జట్టుకు రాక ముందు నుంచి అండగా నిలిచినవారు ఆ మద్దతును అలానే కొనసాగించారు. నేను ఆడకపోయినా.. వారు నాకు మద్దుతుగా ఉండటం సంతోషాన్నిచ్చింది. నా స్నేహితులు, కుటుంబం, తండ్రి, కోచ్‌లు చాలా సపోర్ట్‌గా నిలిచారు. అలాంటి వారు నా జీవితంలో ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.

ఇక టీమ్ సెలెక్ట్ అయినందుకు నేను ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. ఆ సమయంలో నేను అస్సాంలో ఉన్నాను. మా నాన్న మాత్రం చాలా సంతోషించాడు. జట్టులోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చావ్.. ఫోకస్ ఆట మీద పెట్టాలని హెచ్చరించాడు. అవకాశం వస్తే పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని సూచించాడు.'' అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు.

రంజీట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ సాధించడంపై స్పందిస్తూ.. పృథ్వీ షా సంతోషం వ్యక్తం చేశాడు. 'ట్రిపుల్ సెంచరీతో రంజీల్లో రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉంది. నేను ఆటను మాత్రమే ఆడాను. ప్రత్యేకంగా ఏం చేయలేదు. నాపై పూర్తి నమ్మకంతో ఆడాను. సెంచరీ, డబుల్ సెంచరీ చేసినా కూడా పట్టుదలతో నా ఇన్నింగ్స్ కొనసాగించాను. అయితే 400 చేయకపోవడంపై ఇప్పటి కీ బాధపడుతున్నాను. మరో 21 పరుగులు చేస్తే ఆ ఘనత నాకు దక్కేది.'' అని పేర్కొన్నాడు.

కాగా పృథ్వీ షా  2021లో లంక టూర్‌లో ధావన్‌ కెప్టెన్సీలో చివరిసారి టీమిండియాకు ఆడాడు. టీమిండియా తరపున పృథ్వీ షా ఇప్పటివరకు 5 టెస్టుల్లో 339 పరుగులు, ఆరు వన్డేల్లో 189 పరుగులు చేశాడు.

చదవండి: కీలక పదవిలో బ్రియాన్‌ లారా.. గాడిన పెట్టేందుకేనా!

మరిన్ని వార్తలు