'ఆ సమయంలో ద్రవిడ్‌ను చూసి భయపడేవాళ్లం'

25 May, 2021 16:20 IST|Sakshi

ముంబై: టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ అండర్‌-19 జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎందరో యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తూ వారిని మెరికల్లా తయారు చేశాడు. పృథ్వీ షా కూడా ద్రవిడ్‌ పర్యవేక్షణలోనే రాటు దేలాడు. 2018లో పృథ్వీ షా సారధ్యంలోని టీమిండియా కప్‌ గెలవడంలో ద్రవిడ్‌ కీలకపాత్ర పోషించాడు. అయితే అండర్‌-19 సమయంలో మాకు కోచ్‌గా వ్యవహరించిన రాహుల్‌ ద్రవిడ్‌ను చూసి మేమంతా భయపడిపోయేవాళ్లమని పృథ్వీ షా పేర్కొన్నాడు. క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో షా మాట్లాడాడు.

' 2018 అండర్‌-19  ప్రపంచకప్‌కు ముందే ద్రవిడ్‌ సర్‌తో కలిసి ఎన్నో టూర్లు తిరిగాం.. అప్పుడు మాకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన ఆయనతో మాకు ఉన్న అనుబంధం చాలా గొప్పది. మా బ్యాటింగ్‌ విషయంలో ఆయన ఎప్పుడు తలదూర్చలేదు... కానీ తప్పులు చేస్తే మాత్రం వెంటనే సరిదిద్దేవాడు. ఉదాహరణకు.. నా నాచురల్‌ ఆటను ఆడమనేవాడు.. పవర్‌ప్లే ముగిసేలోపు ప్రత్యర్థి జట్టుపై ఎంత ఒత్తిడి పెడితే అంత విజయం సాధించగలం అని చెప్పేవాడు. ఆట కంటే ఎక్కువగా మా మానసిక పరిస్థితి.. గేమ్‌ను ఎలా ఆడాలనేదానిపై ఎక్కువగా ఫోకస్‌ చేసేవాడు. అంతేగాక ఆటను ఎంజాయ్‌ చేస్తూ ఆడాలని.. భయంతో ఎప్పడు ఆడకూడదని చెప్పేవాడు.

మా ఆటలో ఎప్పుడు తలదూర్చేవాడు కాదు.. కానీ తప్పులు చేస్తే మాత్రం వెంటనే సరిదిద్దేవాడు. ఆటలో అంత సీరియస్‌గా ఉండే ద్రవిడ్‌ ఆఫ్‌ఫీల్డ్‌లో మాత్రం సంతోషంగా ఉండేవారు. రెస్టారెంట్లలో భోజనం చేయడానికి వెళ్లినప్పుడు ఆయన చేసే సరదా మాములుగా ఉండేది కాదు. ఒక లెజెండ్‌తో కలిసి కూర్చొని తిన్నామనే సంతోషం మాకు ఉండేది.  అయితే ఆ సమయంలో ద్రవిడ్‌ను చూసి మేమంతా భయపడేవాళ్లం.. కానీ ఆ భయం అతని మీద మాకుండే గౌరవమే. కానీ అతని సారధ్యంలో ఆడాము కాబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ద్రవిడ్‌ బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో ఎందరో ఆటగాళ్లకు తన విలువైన సలహాలు అందిస్తున్నాడు. తాజాగా జూలైలో శ్రీలంక పర్యటనను పురస్కరించుకొని ద్రవిడ్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసింది. త్వరలోనే లంకకు వెళ్లబోయే టీమిండియా రెండో జట్టును కూడా బీసీసీఐ ప్రకటించనుంది. 

ఇక పృథ్వీ షా ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టులో డకౌట్‌గా వెనుదిరిగి విమర్శల పాలవడంతో పాటు జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత జరిగిన దేశవాలీ టోర్నీ అయిన విజయ్‌ హజారే ట్రోఫీలో మాత్రం దుమ్మురేపాడు. నాలుగు సెంచరీలతో చెలరేగిన పృథ్వీ ఆ టోర్నీలో 827 పరుగులు చేసి టాపర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ 14వ సీజన్‌లోనూ పృథ్వీ ఆకట్టుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున 8 మ్యాచ్‌లాడిన షా 308 పరుగులతో రాణించాడు.  ఐపీఎల్‌లో ఆకట్టుకున్నా డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు పృథ్వీ షాను పరిగణలోకి తీసుకోలేదు. అయితే శ్రీలంక పర్యటనకు వెళ్లే టీమిండియా రెండో జట్టుకు అతను ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. 
చదవండి: నెలరోజులు గది నుంచి బయటికి రాలేకపోయా: పృథ్వీ షా

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు