ఆ తప్పు మళ్లీ చేయకూడదనుకున్నా : పృథ్వీ షా

26 Sep, 2020 12:00 IST|Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మంచి అంచనాలతో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఊపుమీద ఉంది. చెన్నైతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సింహగర్జన చేస్తూ 44 పరుగులతో ఘనవిజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా సాధికారిక ఇన్నింగ్స్‌తో మెప్పించి హీరో ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. చెన్నైకి 176 పరుగుల లక్ష్యం విధించడం వెనుక పృథ్వీ షా కృషి చాలా ఉంది. ఈ యువ ఓపెనర్‌ తన ఇన్నింగ్సలో 43 బంతులెదుర్కొని 64 పరుగులు సాధించాడు. ఇందులో 9 బౌండరీలు.. ఒక సిక్స్‌ ఉన్నాయి. మరో ఓపెనర్‌  శిఖర్‌ ధావన్ అండతో పృథ్వీ కొన్ని అమోఘమైన షాట్లతో అలరించాడు. మ్యాచ్‌ అనంతరం పృథ్వీ షా స్పందించాడు.

'నేను నా సహజమైన ఆటతీరునే ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకోసం మైదానం నలువైపులా షాట్లు ఆడేందుకు ప్రయత్నించా. గత మ్యాచ్‌లో చేసిన పొరపాట్లు మళ్లీ చేయకూడదని అనుకున్నా. నా నిర్లక్ష్య ఆటతీరుతో జట్టుకు నష్టం కలిగించకూడదు. సీఎస్‌కే బౌలర్ల నుంచి కొన్ని బంతులు వచ్చాయి. పిచ్‌ పరిస్థితిని అర్థం చేసుకొని బ్యాటింగ్‌ కొనసాగించా.  శిఖర్‌ ధావన్ ఒక అనుభవజ్ఞుడిగా నా ఇన్నింగ్స్‌కు మంచి సహకారమందించాడు. జట్టు స్కోరు 40 పరుగుల వద్ద ఉన్నప్పుడు స్పిన్నర్లు వచ్చినా అప్పటికే పేస్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం కాబట్టి పెద్ద క‌ష్టం అనిపించలేదు.' అని తెలిపాడు. (చదవండి : 'ధోని ఇలా చేయడం ఇదే తొలిసారి')

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. ' ఒక కెప్టెన్‌గా ఈ విజయాలను ఆస్వాధిస్తున్నా. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలవడం మా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇప్పుడు మేం జట్టుగా దీనిని ఇలాగే కొనసాగిస్తూ ఆటతీరును మరింత మెరుగుపరుచుకుంటాం. తొలి అంచలోనే వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్‌ అవకాశాలను సుస్థిరం చేసుకోవాలి. దుబాయ్‌కు వచ్చిన తర్వాత ఆరు రోజుల క్వారంటైన్‌ మాకు చాలా కష్టంగా అనిపించింది.' అంటూ తెలిపాడు. కాగా చెన్నైతో మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు రబడ 3 వికెట్లు, నోర్ట్జే 2 వికెట్లతో  అద్భుత ప్రదర్శన చేశారు. కాగా ఢిల్లీ తన తర్వాతి మ్యాచ్‌లో సెప్టెంబర్‌ 29న అబుదాబి వేదికగా సన్‌రైజర్స్‌తో తలపడనుంది.(చదవండి : సన్‌రైజర్స్‌ ‘గాయం’ ఎంతవరకూ..)

మరిన్ని వార్తలు