ఇంగ్లండ్‌ టూర్‌కు పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్!

24 Jul, 2021 17:11 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సీరిస్‌కు భారత యువ ఓపెనర్ పృథ్వీ షా, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ వెళ్లడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో గాయపడిన  శుభమన్ గిల్ ఇంగ్లండ్‌ సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. మరోవైపు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో యువ ఫాస్ట్‌ బౌలర్‌ అవేష్ ఖాన్ , ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడి సిరీస్‌కి దూరమయ్యారు. దీంతో  పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లను  పంపాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించినట్లు సమాచారం.

వీళ్లతో పాటు స్పిన్నర్‌ జయంత్ యాదవ్‌ను కూడా పంపించాలి అని బీసీసీఐ భావించినప్పటికీ, కార్వంటైన్‌ నిబంధనల మధ్య తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.  ప్రస్తుతం పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ శ్రీలంక పర్యటనలో ఉన్నారు. ఆదివారం నుంచి జరుగునున్న మూడు టీ20ల సిరీస్‌లోనూ ఆడనున్నారు. అనంతరం ఇంగ్లండ్‌కి బయల్దేరి అక్కడ బయో బబుల్‌లో ఉండనున్నారు.  ఈ నేపథ్యంలో టీ 20, వన్డేల్లో అరంగేట్రం చేసిన స్టైలిష్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ ఇప్పుడు టెస్టుల్లోను సత్తా చాటేందుకు సమాయత్తం కానున్నాడు . కాగా ఇంగ్లండ్‌‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ ఐదు టెస్టుల సిరీస్‌ను విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత్ జట్టు ఆడనుంది.

మరిన్ని వార్తలు