Pro Kabaddi League 2021: కబడ్డీ కూతకు వేళాయె...

22 Dec, 2021 01:33 IST|Sakshi
విన్నర్స్‌ ట్రోఫీతో 12 జట్ల కెప్టెన్లు

నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ 

ఎనిమిదో సీజన్‌

లీగ్‌ మొత్తం బెంగళూరులోనే

మ్యాచ్‌లన్నీ స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం 

Pro Kabaddi 2021 Schedule And Venue: కూత పెట్టేందుకు ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ముస్తాబైంది. నేటి నుంచి ఎనిమిదో సీజన్‌  జరగనుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌ మ్యాచ్‌లన్నీ బెంగళూరు వేదికపైనే జరుగనున్నాయి. కోవిడ్‌ మహమ్మారి వల్ల గతేడాది టోర్నీ రద్దు కావడంతో ఈ సీజన్‌ను  పకడ్బందీగా బయో బబుల్‌లో నిర్వహిస్తున్నారు. మొత్తం 12 జట్లు ఇది వరకే బయో బబుల్‌లో ఉన్నాయి. మాజీ చాంపియన్లు యు ముంబా, బెంగళూరు బుల్స్‌ల మధ్య బుధవారం జరిగే తొలి మ్యాచ్‌తో పీకేఎల్‌–8 మొదలవుతుంది. ఈ మ్యాచ్‌ ముగియగానే తెలుగు టైటాన్స్, తమిళ్‌ తలైవాస్‌ మధ్య రెండో మ్యాచ్‌ జరుగుతుంది. అనంతరం మూడో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగాల్‌ వారియర్స్‌తో యూపీ యోధ తలపడుతుంది.  

ఈ సీజన్‌లో తొలి నాలుగు రోజులు మూడు మ్యాచ్‌ల చొప్పున నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం కూడా మూడేసి మ్యాచ్‌లుంటాయి. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక టాప్‌–6లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఫైనల్‌తో ఎనిమిదో సీజన్‌ ముగుస్తుంది. తొలి రెండు మ్యాచ్‌లు వరుసగా రాత్రి గం. 7:30 నుంచి... గం. 8:30 నుంచి మొదలవుతాయి. మూడో మ్యాచ్‌లను రాత్రి గం. 9:30 నుంచి నిర్వహిస్తారు. మ్యాచ్‌లన్నీ స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రసారమవుతాయి. పీకేఎల్‌లో మ్యాచ్‌ గెలిచిన జట్టుకు ఐదు పాయింట్లు లభిస్తాయి. ‘టై’ అయితే రెండు జట్ల ఖాతాలో మూడు పాయింట్లు చొప్పున చేరుతాయి. ఏడు లేదా అంతకంటే తక్కువ పాయింట్ల తేడాతో ఓడిన జట్టుకు ఒక పాయింట్‌ ఇస్తారు. ఏడు పాయింట్ల కంటే ఎక్కువ తేడాతో ఓడిన జట్టుకు పాయింట్లేమీ రావు.

పీకేఎల్‌ బరిలో ఉన్న జట్లు
బెంగళూరు బుల్స్, జైపూర్‌ పింక్‌ పాంథర్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్, యు ముంబా, తెలుగు టైటాన్స్, బెంగాల్‌ వారియర్స్, దబంగ్‌ ఢిల్లీ, గుజరాత్‌ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, తమిళ్‌ తలైవాస్, యూపీ యోధ.

మరిన్ని వార్తలు