గోల్‌ కొట్టి అమెరికాకు.. మెరిసిన ప్రొద్దుటూరు బాలిక

11 Feb, 2023 07:37 IST|Sakshi
ఇండియన్‌ జట్టుతో శ్రీదేవి

ఫుట్‌బాల్‌లో మెరిసిన ప్రొద్దుటూరు బాలిక శ్రీదేవి

కాలిఫోర్నియాలో నిర్వహించే హోమ్‌లెస్‌ వరల్డ్‌ కప్‌కు కానపల్లె క్రీడాకారిణి

ప్రొద్దుటూరు: వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మండలం కానపల్లె గ్రామానికి చెందిన వజ్జల శ్రీదేవి త్వరలో కాలిఫోర్నియాలో జరగనున్న అంతర్జాతీయ ఫుట్‌ బాల్‌ పోటీల్లో పాల్గొననుంది. కానపల్లె గ్రామానికి చెందిన ఈమె తల్లిదండ్రులు శ్రీనివాసులు, సుబ్బమ్మ వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తమ కుమార్తెకు క్రీడలపై ఉన్న ఆసక్తిని గమనించి నాలుగో తరగతిలోనే కడపలోని వైఎస్సార్‌ క్రీడా పాఠశాలలో చేర్పించారు. తర్వాత శ్రీదేవి నెల్లూరు శాప్‌ అకాడమీలో ఉంటూ ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది.

ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ఫుట్‌బాల్‌పై పట్టు ఉన్న శ్రీదేవి ఎన్నో మార్లు పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. గతంలో అరుణాచలంలో జరిగిన సీనియర్‌ క్యాంప్, కటక్‌లో జరిగిన జూనియర్‌ క్యాంప్, గుంటూరులో జరిగిన ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి  బహుమతులు సాధించింది. ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాగపూర్‌లోని స్లమ్స్‌ సాకర్‌ స్టేడియంలో ఇండియా ఫుట్‌బాల్‌ జట్టుకు సంబంధించి ఎంపికలు జరిగాయి. ఇందులో మొత్తం 28 మందిని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వజ్జల శ్రీదేవి ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యార్థినికి కోచ్‌గా కె.సాయికిరణ్‌ వ్యవహరిస్తున్నారు.     

హోమ్‌లెస్‌ వరల్డ్‌ కప్‌ అంటే.. 
హోమ్‌లెస్‌ వరల్డ్‌ కప్‌ ఫౌండేషన్‌ ద్వారా నిర్వహించే వార్షిక అసోసియేషన్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌. ఇది అసోసియేషన్‌ ఫుట్‌బాల్‌ క్రీడ ద్వారా నిరాశ్రయులు లేకుండా చేయాలని సూచించే సామాజిక సంస్థ. సంస్థ వార్షిక ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తుంది. ఇక్కడ వివిధ దేశాల నుంచి నిరాశ్రయులైన వ్యక్తుల జట్లు పోటీపడతాయి.

నిరాశ్రయులైన ప్రపంచ కప్‌ సంస్థను 2001లో మెల్‌ యంగ్, హెరాల్డ్‌ ష్మీడ్‌ స్థాపించారు. నిరాశ్రయుల కోసం మొదటి వార్షిక ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ 2003లో ఆస్ట్రియాలోని గ్రాజ్‌లో జరిగింది. ఇటీవల 2019 ఎడిషన్‌ను వేల్స్‌ కార్డిఫ్‌లోని బ్యూట్‌ పార్క్‌లో నిర్వహించింది. 2020 టోర్నమెంట్‌ ఫిన్‌లాండ్‌లోని టాంపేర్‌లో జరగాల్సి ఉంది. అయితే కోవిడ్‌ మహమ్మారి కారణంగా రద్దు అయింది. 2023 ఏప్రిల్‌లో యూఎస్‌ఏలోని కాలిఫోర్నియాలో ఈ టోర్నమెంట్‌ నిర్వహించనున్నారు. హోమ్‌లెస్‌ వరల్డ్‌ కప్‌ యొక్క అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లోని ఈస్టర్‌ రోడ్‌ స్టేడియంలో ఉంది.  

జాతీయ జట్టులో.. 
వజ్జల శ్రీదేవి త్వరలో అమెరికాలోని కాలిఫోర్నియాలో జరగనున్న ఫుట్‌బాల్‌ హోమ్‌లెస్‌ వరల్డ్‌ కప్‌ పోటీలకు వెళ్లనుంది. ఈ ఏడాది జరగనున్న పోటీలకు సంబంధించి ఇండియా జట్టును ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీదేవి ప్రథమ స్థానంలో ఉంది.  
 – కె.సాయికిరణ్, ఫుట్‌బాల్‌ కోచ్‌  

వరల్డ్‌ కప్‌లో విజయమే లక్ష్యం 
ఇండియా జట్టుకు ఎంపికయ్యాను. వరల్డ్‌ కప్‌ పోటీల్లో విజయమే లక్ష్యంగా ప్రతిభ చూపుతా. చిన్ననాటి నుంచి ఫుట్‌బాల్‌ క్రీడపై ఎంతో మక్కువ. చదువు లేని నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు.  
– వజ్జల శ్రీదేవి, ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి, కానపల్లె, ప్రొద్దుటూరు మండలం, వైఎస్సార్‌ జిల్లా.   

మరిన్ని వార్తలు