PSL 2022: ఫఖర్‌ జమాన్‌ తొందరపడ్డావు.. కాస్త ఆగుంటే బాగుండేది

3 Feb, 2022 19:26 IST|Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో(పీఎస్‌ఎల్‌ 2022) చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. లాహోర్‌ ఖలండర్స్‌ క్రికెటర్‌ ఫఖర్‌ జమాన్‌ తనను తానే ట్రోల్‌ చేసుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. పెషావర్‌ జాల్మి ఇన్నింగ్స్‌ సమయంలో ఫఖర్‌ జమాన్‌ రెండుసార్లు సులువైన క్యాచ్‌లు జారవిడిచాడు. మొదటిసారి సహచర క్రికెటర్‌ మహ్మద్‌ హఫీజ్‌తో జరిగిన మిస్‌ కమ్యూనికేషన్‌ వల్ల ఫఖర్‌ క్యాచ్‌ జారవిడిచాడు. దీంతో హైదర్‌ అలీ బతికిపోయాడు.

రెండోసారి షెర్ఫెన్‌ రూథర్‌ఫర్డ్‌ మిడాఫ్‌ దిశగా షాట్‌ ఆడాడు. ఈసారి కూడా జమాన్‌ క్యాచ్‌ తీసుకోవడంలో విఫలమయ్యాడు. కానీ తర్వాతి ఓవర్‌లోనే రూథర్‌ఫర్డ్‌ను మెరుపువేగంతో రనౌట్‌ చేసి తన పొరపాటును కవర్‌ చేసుకున్నాడు. అయితే అంతకముందు రెండు సులువైన క్యాచ్‌లు వదిలేసినందుకు ట్విటర్‌లో తనను తానే ట్రోల్‌ చేసుకుంటూ ఫోటోను షేర్‌ చేశాడు. ఫఖర్‌ చేసిన పనిపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ వినూత్నంగా స్పందించారు. ఫఖర్‌ జమాన్‌ తొందరపడ్డావు.. కాస్త ఆగుంటే బాగుండేది.. అనవసరంగా ట్రోల్‌ చేసుకున్నావు.. అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. లాహోర్‌ ఖలండర్స్‌ 20 పరుగుల తేడాతో పెషావర్‌ జాల్మిపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లాహోర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఫఖర్‌ జమాన్‌(66), షఫీక్‌(41 రాణించగా.. ఆఖర్లో మహ్మద్‌ హఫీజ్‌(19 బంతుల్లో 37 నాటౌట్‌), రషీద్‌ ఖాన్‌(8 బంతుల్లో 22 నాటౌట్‌) మెరిశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170 పరుగుల వద్దే ఆగిపోయింది.

మరిన్ని వార్తలు