PSL 2022: క్యాచ్‌ పట్టలేదని చెంపదెబ్బ పీకాడు.. ఎంతైనా పాక్‌ క్రికెటర్‌ కదా.. ఆ మాత్రం ఉండాలి

22 Feb, 2022 09:02 IST|Sakshi

మ్యాచ్‌లో క్యాచ్‌ డ్రాప్‌ చేస్తే..'' ఏం కాదులే.. బౌండరీ వెళ్లకుండా ఆపావు అంటూ'' ఎంకరేజ్‌ చేసే బౌలర్లను చూసుంటాం.. లేదంటే క్యాచ్‌ వదిలేశాడన్న కోపంతో బౌలర్‌ సదరు ఆటగాడిని బూతులు తిట్టడం చూసుంటాం.. కానీ ఇక్కడ మనం చెప్పుకునే బౌలర్‌ అంతకుమించి అని చెప్పొచ్చు. క్యాచ్‌ డ్రాప్‌ చేశాడనే కోపంతో బౌలర్‌ ఏకంగా ఆటగాడికి చెంపదెబ్బను బహుమతిగా ఇచ్చాడు. ఎంతైనా పాక్‌ క్రికెటర్‌ కదా.. ఆ మాత్రం ఉండాలి. ఈ ఘటన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో చోటుచేసుకుంది.

సోమవారం పెషావర్‌ జాల్మి, లాహోర్‌ ఖలందర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. పెషావర్‌ ఇన్నింగ్స్‌ సమయంలో హారిస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో హజ్రతుల్లా జజయి పాయింట్‌ దిశగా ఆడాడు.  అక్కడే ఉన్న కమ్రాన్‌ గులామ్‌ ఈజీ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత అదే ఓవర్‌ చివరి బంతికి హారిస్‌ రౌఫ్‌ మహ్మద్‌ హారిస్‌ను ఔట్‌ చేశాడు. మహ్మద్‌ హారిస్‌ ఫైన్‌లెగ్‌ దిశగా షాట్‌ ఆడగా.. పవాద్‌ అహ్మద్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో సెలబ్రేషన్స్‌లో మునిగిపోయిన హారిస్‌ రౌఫ్‌.. కమ్రాన్‌ గులామ్‌ను చూడాగానే క్యాచ్‌ వదిలేశాడన్న సంగతి గుర్తొచ్చినట్టుంది.

చదవండి: Wriddiman Saha: బెదిరింపులు నిజమేనా?.. సాహాను వివరణ కోరనున్న బీసీసీఐ

అంతే.. అందరూ చూస్తుండగానే హారిస్‌.. కమ్రాన్‌ గులామ్‌పై చేయి చేసుకొని పక్కకు నెట్టేశాడు. అయితే కమ్రాన్‌ దీనిని సీరియస్‌గా తీసుకోకుండా అభినందించగా.. హారిస్‌ మాత్రం అతన్ని సీరియస్‌గానే చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఉద్దేశపూర్వకంగానే హారిస్‌ రౌఫ్‌ తోటి ఆటగాడిపై చేయి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో పీసీబీ హారిస్‌పై ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇక మ్యాచ్‌ ఫలితం సూపర్‌ ఓవర్‌ ద్వారా రావడం విశేషం. తొలుత బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌ జాల్మి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన లాహోర్‌ ఖలందర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 158 పరుగులు చేసింది. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. ఇక సూపర్‌ ఓవర్‌లో పెషావర్‌ జాల్మీ విజయం సాధించింది.  

చదవండి: 2 ఓవర్లు.. 10 బంతుల్లో 5 వికెట్లు.. ప్రపంచం‍లోనే తొలి బౌలర్‌గా!

ఇక పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో(పీఎస్‌ఎల్‌ 2022) అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అలెక్స్‌ హేల్స్‌, పాల్‌ స్ట్రింగ్‌లు వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరం కాగా.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ ఫాల్కనర్‌ ఆర్దికపరమైన సమస్యలతో లీగ్‌ నుంచి అర్థంతరంగా వైదొలిగాడు. తనకు ఇస్తానన్న డబ్బులు మొత్తం ఇవ్వకుండా మ్యాచ్‌లు ఆడించిందని.. పీఎస్‌ఎల్‌లో అంతా అవినీతే జరుగుతుందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే పీసీబీ ఫాల్కనర్‌ వార్తల్లో నిజం లేదంటూ కొట్టిపారేసింది. 

>
మరిన్ని వార్తలు