PSL 2022: ఒకరినొకరు భయంకరంగా గుద్దుకున్నారు..

11 Feb, 2022 17:01 IST|Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌లీగ్‌(పీఎస్‌ఎల్‌ 2022)లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాచ్‌ అందుకునే క్రమంలో ఆటగాళ్లు ఒకరినొకరు భయకరంగా గుద్దుకున్నప్పటికి తమ లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. పెషావర్‌ జాల్మీ, ముల్తాన్‌ సుల్తాన్స్‌ మధ్య మ్యాచ్‌లో ఇది జరిగింది. చేజింగ్‌కు దిగిన పెషావర్‌ జాల్మి ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే కమ్రాన్‌ అక్మల్‌ భారీ షాట్‌కు యత్నించాడు. అయితే బ్యాట్‌కు సరైన దిశలో తగలని బంతి ఫైన్‌లెగ్‌ దిశగా హైట్‌లోకి వెళ్లింది.

చదవండి: 'అది నీ తప్పు కాదు'.. ఇషాన్‌ కిషన్‌తో మెసేజ్‌

కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఒకవైపు నుంచి.. షాహనావాజ్‌ దహాని మరో ఎండ్‌ నుంచి క్యాచ్‌ కోసం పరిగెత్తారు. ఇద్దరు ఎదురుఎదురుగా వచ్చి ఒకరినొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. అనవసరంగా క్యాచ్‌ మిస్‌ అయిందని మనం అనుకునేలోపే అద్భుతం జరిగింది. కిందపడుతూనే దహాని ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకేముందు సెలబ్రేషన్స్‌ షురూ అయ్యాయి. మహ్మద్‌ రిజ్వాన్‌ వచ్చి సారీ చెప్పడం.. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు హగ్‌ చేసుకోవడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముల్తాన్‌ సుల్తాన్స్‌ 42 పరుగుల తేడాతో పెషావర్‌ జాల్మీపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముల్తాన్‌ సుల్తాన్స్‌.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. మసూద్‌ 68, రిజ్వాన్‌ 34, టిమ్‌ డేవిడ్‌ 34 రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పెషావర్‌ జాల్మీ 19.3 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. షోయబ్‌ మాలిక్‌ 44 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: Virat Kohli: సెంచరీ చేస్తాడనుకుంటే డకౌట్ల రికార్డుతో మెరిశాడు

మరిన్ని వార్తలు