Azam Khan: తుపాన్‌ ఇన్నింగ్స్‌.. 42 బంతుల్లోనే.. 9 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో..

25 Feb, 2023 10:02 IST|Sakshi
ఆజం ఖాన్‌ (PC: Twitter)

Pakistan Super League, 2023: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో యువ బ్యాటర్‌ ఆజం ఖాన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. క్వెటా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 230కి పైగా స్ట్రైక్‌రేటుతో 97 పరుగులు సాధించాడు. 

తద్వారా ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ భారీ స్కోరు చేసి గెలుపొందడంలో ఆజం ఖాన్‌ సహాయపడ్డాడు. అద్భుత ఆట తీరుతో 24 ఏళ్ల ఈ రైట్‌ హ్యాండర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. కాగా పీఎస్‌ఎల్‌-2023లో భాగంగా కరాచీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఇస్లామాబాద్‌, క్వెటా గ్లాడియేటర్స్‌తో తలపడింది.

ఆరంభంలో తడ‘బ్యా’టు
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇస్లామాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్‌ రెహ్మానుల్లా గుర్బాజ్‌ 8 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ వాన్‌ డెర్‌ డసెన్‌ ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు.

ఈ క్రమంలో మరో ఓపెనర్‌ కోలిన్‌ మున్రో 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఐమల్‌ ఖాన్‌ అతడిని తొందరగానే పెవిలియన్‌కు పంపాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 

ఆజం ఖాన్‌ అద్భుత ఇన్నింగ్స్‌
ఇలాంటి సమయంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్‌ కీపర్‌ ఆజం ఖాన్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ అయినప్పటికీ తుపాన్‌ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన తీరు ప్రేక్షకులకు ఆకట్టుకుంది. 

ఆజంకు తోడుగా అసిఫ్‌ అలీ 42 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇస్లామాబాద్‌ 220 పరుగులు స్కోరు చేసింది. ఆరు వికెట్లు నష్టపోయి ఈ మేర భారీ స్కోరు సాధించింది.

రెండో స్థానానికి
ఇక లక్ష్య ఛేదనకు దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌ 19.1 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో ఇస్లామాబాద్‌కు 63 పరుగుల తేడాతో విజయం దక్కింది. ఇస్లామాబాద్‌ బౌలర్లు ఫజల్‌హక్‌ ఫారూకీ(అరంగేట్రం), హసన్‌ అలీ మూడేసి వికెట్లు తీయగా.. అబ్రార్‌ అహ్మద్‌, షాబాద్‌ ఖాన్‌ షాదాబ్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఇస్లామాబాద్‌ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

చదవండి: WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో!
T20 WC 2023 Final: సౌతాఫ్రికా క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. ఆఖరి పోరులో ఆసీస్‌తో..

మరిన్ని వార్తలు