PSL 2023 KK Vs LQ: కట్టింగ్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. ఇమ్రాన్‌ తాహిర్‌ మాయాజాలం

13 Mar, 2023 10:37 IST|Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో చాలా రోజుల తర్వాత బౌలర్ల హవా నడిచింది. లీగ్‌లో భాగంగా నిన్న  (మార్చి 12) జరిగిన రెండు మ్యాచ్‌ల్లో నాలుగు జట్ల బౌలర్లు పేట్రేగిపోయారు. ఫలితంగా గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న పరుగుల ప్రవాహానికి పాక్షికంగా బ్రేక్‌ పడింది. నిన్న మధ్యాహ్నం ఇస్లామాబాద్‌ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌ జల్మీ ఓ మోస్తరు స్కోర్‌ (179/8) నమోదు చేయగా.. ఛేదనలో జల్మీ బౌలర్ల ధాటికి ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ (166 ఆలౌట్‌) చేతులెత్తేసింది. 

రాత్రి జరిగిన మ్యాచ్‌లోనూ దాదాపు ఇదే సీన్‌ రిపీటయ్యింది. లాహోర్‌ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కరాచీ కింగ్స్‌ జట్టు.. ముహమ్మద్‌ అక్లక్‌ (51), ఇమాద్‌ వసీం (45), తయ్యబ్‌ తాహిర్‌ (40), బెన్‌ కట్టింగ్‌ (33) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఖలందర్స్‌.. ఇమాద్‌ వసీం (2/26), అకీఫ్‌ జావిద్‌ (2/8), మహ్మద్‌ ఉమర్‌ (2/20), జేమ్స్‌ ఫుల్లర్‌ (1/29), ఇమ్రాన్‌ తాహిర్‌ (2/24) చెలరేగడంతో 18.5 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.

కాగా, ఈ పీఎస్‌ఎల్‌ సీజన్‌లో ట్రెండ్‌ను పరిశీలిస్తే.. దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఇరు జట్లు సునాయాసంగా 200 పరుగుల మైలురాయిని దాటాయి. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే ముల్తాన్‌ సుల్తాన్స్‌ రికార్డు స్థాయిలో 262 పరుగులు చేయగా.. ఛేదనలో అదే స్థాయిలో రెచ్చిపోయిన గ్లాడియేటర్స్‌ 253 పరుగులు చేసి లక్ష్యానికి 10 పరుగులు దూరంలో నిలిచిపోయింది.

ఈ సీజన్‌ మ్యాచ్‌ల గురించి చెప్పుకుంటు పోతే 240, 242, 243, 244, 226.. ఇలా ఆయా జట్లు పలు మార్లు 250 పరుగుల మైలురాయి వరకు రీచ్‌ అయ్యాయి. ప్రస్తుత సీజన్‌లో బ్యాటర్లు శతక్కొట్టుడులోనూ టాప్‌లో నిలిచారు. మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజమ్‌, జేసన్‌ రాయ్‌, రిలీ రొస్సొ, ఫకర్‌ జమాన్‌, ఉస్మాన్‌ ఖాన్‌ వంటి బ్యాటర్లు విధ్వంసకర శతకాలతో విరుచుకుపడి ఆయా జట్లు భారీ స్కోర్లు చేయడానికి దోహదపడ్డారు.

మరోవైపు లీగ్‌ కూడా చివరి అంకానికి చేరింది. మార్చి 15 లాహోర్‌ ఖలందర్స్‌-ముల్తాన్‌ సుల్తాన్స్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుండగా.. ఇస్లామాబాద్‌ యునైటెడ్‌, పెషావర్‌ జల్మీ మార్చి 16న జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఆ తర్వాత ఎలిమినేటర్‌-2, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.   

మరిన్ని వార్తలు