Shaheen Afridi: తొలి బంతికి బ్యాట్‌ రెండు ముక్కలైంది.. రెండో బంతికి వికెట్‌ ఎగిరిపడింది

27 Feb, 2023 14:59 IST|Sakshi

PSL 2023: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2023 సీజన్‌లో బ్యాట్‌కు బంతికి మధ్య భీకర పోరు నడుస్తోంది. లాహోర్‌ ఖలందర్స్‌-పెషావర్‌ జల్మీ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో ఈ పోరు పతాక స్థాయికి చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లాహోర్‌ ఖలందర్స్‌.. ప్రత్యర్ధి బౌలర్లను ఓ రేంజ్‌లో ఆడుకోగా.. అనంతరం బరిలోకి దిగిన పెషావర్‌ జల్మీపై ఖలందర్స్‌ బౌలర్లు షాహీన్‌ అఫ్రిది (4-0-40-5), హరీస్‌ రౌఫ్‌ (4-0-38-1), జమాన్‌ ఖాన్‌ (3-0-28-2) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు.

బౌలర్లకు, బ్యాటర్లకు మధ్య జరిగిన ఈ భీకర పోరులో ఓ ఆసక్తికర విషయం అందరినీ ఆకట్టుకుంది. ఖలందర్స్ నిర్ధేశించిన 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పెషావర్‌కు తొలి బంతికే షాహీన్‌ అఫ్రిది షాక్‌ ఇచ్చాడు. మెరుపు వేగంతో షాహీన్‌ సంధించిన బంతిని డ్రైవ్‌ చేసే క్రమంలో మహ్మద్‌ హరీస్‌ బ్యాట్‌ రెండు ముక్కలైంది. అనంతరం మరో బ్యాట్‌తో బ్యాటింగ్‌ కొనసాగించిన హరీస్‌ను షాహీన్‌ రెండో బంతికే క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. షాహీన్‌ సంధించిన వేగం ధాటికి ఆఫ్‌్‌ స్టంప్‌ గాల్లోకి పల్టీలు కొడుతూ నాట్యం చేసింది. చూడముచ్చటైన ఈ తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లాహోర్‌ ఖలందర్స్‌.. ఫకర్‌ జమాన్‌ (45 బంతుల్లో 96; 3 ఫోర్లు, 10 సిక్సర్లు), షఫీక్‌ (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్‌ బిల్లింగ్స్‌ (23 బంతుల్లో 47 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంకర ఇన్నింగ్స్‌ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

అనంతరం బరిలోకి దిగిన పెషావర్‌ జల్మీ కూడా ఏమాత్రం తగ్గకుండా విజృంభించి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదినప్పటికీ టార్గెట్‌ కొండంతలా ఉండటంతో 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పెషావర్‌ బ్యాటర్లు సైమ్‌ అయూబ్‌ (34 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), భానుక రాజపక్ష (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్‌), రోవమన్‌ పావెల్‌ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్‌), జేమ్స్‌ నీషమ్‌ (8 బంతుల్లో 12; సిక్స్‌), సాద్‌ మసూద్‌ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు) పోరాడినప్పటికీ ఫలితం​ లేకుండా పోయింది. పెషావర్‌ టీమ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగలిగింది. 


 

మరిన్ని వార్తలు