రషీద్‌ పాంచ్‌ పటాకా.. టాప్‌లో లాహోర్‌ ఖలందర్స్‌

11 Jun, 2021 13:28 IST|Sakshi

అబుదాబి: యూఏఈ వేదికగా జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌ 6)లో లాహోర్‌ ఖలందర్స్‌ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఇస్లామాబాద్‌ యునైటెడ్‌పై బుధవారం థ్రిల్లింగ్‌ విక్టరీ నమోదు చేసిన లాహోర్‌ గురువారం పెషావర్‌ జాల్మిపై 10 పరుగుల తేడాతో విజయం సాధించి మొత్తంగా 6 మ్యాచ్‌లాడి 5 విజయాలు.. ఒక ఓటమితో 10 పాయింట్లు సాధించి టేబుల్‌ టాపర్‌గా నిలిచింది.

గత మ్యాచ్‌లో సూపర్‌ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఈసారి బౌలింగ్‌లో అదరగొట్టాడు. మ్యాచ్‌లో ఐదు కీలక వికెట్లు తీసి మరోసారి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. పీఎస్‌ఎల్‌లో ఐదు వికెట్లు తీయడం రషీద్‌కు ఇదే తొలిసారి. రషీద్‌ ఐదు వికెట్లు తీసిన వీడియోనూ పీఎస్‌ఎల్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.


అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఖలందర్స్‌ 25 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో టిమ్‌ డేవిడ్‌ (36 బంతుల్లో 64, 3 ఫోర్లు, 5 సిక్సర్లు), బెన్‌ డంక్‌(33 బంతుల్లో 48, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా.. చివర్లో జేమ్స్‌ ఫాల్కనర్‌ 7 బంతుల్లో 22 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 160 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. షోయబ్‌ మాలిక్‌ 73 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగతావారు ఎవరు పెద్దగా రాణించలేదు.

చదవండి: దంచికొట్టిన రషీద్‌ ఖాన్‌.. ఆఖరి బంతికి విజయం

మరిన్ని వార్తలు