Neeraj Chopra: 37 ఏళ్ల నా కలను నిజం చేశావు బేటా.. థ్యాంక్యూ'

8 Aug, 2021 10:28 IST|Sakshi

ఢిల్లీ: నీరజ్‌ చోప్రా.. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా జావెలిన్‌ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశానికి అథ్లెటిక్స్‌ విభాగంలో తొలి స్వర్ణం అందించి చరిత్ర సృష్టించాడు. జావెలిన్‌ త్రో  ఫైనల్లో 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణంతో జపాన్‌ గడ్డపై మువన్నెల జెండాను రెపరెపలాడించాడు. ఈ నేపథ్యంలో 'పరుగుల రాణి' పీటీ ఉష నీరజ్‌ చోప్రాను అభినందిస్తూ అతనితో దిగిన పాత ఫోటోను తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. '' 37 ఏళ్ల తర్వాత నా కలను నిజం చేశావు.. థ్యాంక్యూ బేటా.. ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయానన్న బాధను ఈరోజుతో మర్చిపోయేలా చేశావు. నేను సాధించకుంటే ఏంటి.. ఒక భారతీయుడిగా నువ్వు దానిని చేసి చూపించావు'' అంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం పీటీ ఉష ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా '' పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌'' .. '' పరుగుల రాణిగా'' పేరు పెందిన పీటీ ఉష.. 1984 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో తృటిలో పతకం సాధించే అవకాశం కోల్పోయింది. ఆ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్‌ విభాగంలో పోటీ పడిన ఆమె  సెకనులో వందోవంతులో కాంస్య పతకం కోల్పోవాల్సి వచ్చింది. పీటీ ఉష 400 మీ హార్డిల్స్‌ను 55. 42 సెకన్లలో పూర్తి చేయగా.. రోమానియాకు చెందిన క్రిస్టియానా కోజోకారు 55.41 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్యం గెలుచుకోవడంతో ఉష నాలుగో స్థానంలో నిలిచింది. అలా ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ విభాగంలో భారత్‌​కు పతకం అందించాలనేది కలగానే మిగిలిపోయింది. ఈ విషయాన్ని పీటీ ఉష స్వయంగా చాలా ఇంటర్య్వూల్లో పేర్కొంది. అయితే ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన తొలి భారతీయ మహిళగా మాత్రం పీటీ ఉష రికార్డు పదిలంగా ఉంది. అంతకముందు 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలతో పాటు రజతం సాధించింది. అలాగే 1982 ఢిల్లీ ఆసియా క్రీడలలో 2 రజతాలు, 1990 ఆసియాడ్ లో 3 రజతాలు, 1994 ఆసియాడ్‌లో ఒక రజత పతకాన్ని సాధించింది.

మరిన్ని వార్తలు