తొలి పరుగు.. 30 బంతులు.. నాలుగు మెయిడిన్లు

16 Jan, 2021 10:35 IST|Sakshi

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులకే ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ వికెట్లను కోల్పోయింది. గిల్‌ ఏడు పరుగులకే ఔట్‌ కాగా, రోహిత్‌ శర్మ 74 బంతుల్లో 6 ఫోర్లతో  44 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. కమిన్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ రెండో బంతికి గిల్‌ ఔట్‌ కాగా, లయన్‌ వేసిన 20 ఓవర్‌ ఐదో బంతికి రోహిత్‌ పెవిలియన్‌ చేరాడు. గిల్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి పుజారా రాగా, రోహిత్‌ ఔటైన తర్వాత రహానే బ్యాటింగ్‌కు దిగాడు. వీరిద్దరూ మెల్లగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళుతున్నారు. క్రీజ్‌లో పాతుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఆసీస్‌ బౌలర్లకు పరీక్షగా నిలిచారు. ఈ జోడి పరుగు సాధించడానికి 30  బంతులు తీసుకుంది. దాంతో వరుసగా నాలుగు మెయిడిన్లు పడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది.  (లంచ్‌కు ముందే ఆసీస్‌ ఆలౌట్‌)

అంత​కుముందు ఆసీస్‌ 369 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. 274/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఈ రోజు ఆటలో భాగంగా లంచ్‌కు ముందే ఆసీస్‌ను ఆలౌట్‌ చేశారు.  ఓవరనైట్‌ ఆటగాళ్లు పైన్‌, కామెరూన్‌ గ్రీన్‌లు ఆకట్టుకున్నారు. ఈ జోడి 98 పరుగులు జోడించారు. ఆరో వికెట్‌గా పైన్‌ ఔటైన తర్వాత ఆసీస్‌ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్లలో స్టార్క్‌ 20 పరుగులతో అజేయంగా నిలవగా, లయన్‌ 24 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో నటరాజన్‌, శార్దూల్‌ ఠాకూర్, వాషింగ్టన్‌‌లు తలో మూడు వికెట్లు సాధించగా, సిరాజ్‌కు వికెట్‌ దక్కింది.(అర్జున్‌ టెండూల్కర్‌ అరంగేట్రం..)

మరిన్ని వార్తలు