Pujara-Ashwin: 'నా స్థానాన్ని ఆక్రమించావు.. అందుకే కృతజ్ఞతగా'

14 Mar, 2023 15:53 IST|Sakshi

అహ్మదాబాద్‌ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఐదురోజుల పాటు జరిగిన మ్యాచ్‌లో పిచ్‌కు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి ఉస్మాన్‌ ఖవాజా, కామెరాన్‌ గ్రీన్‌లు శతకాలతో విరుచుకుపడగా.. టీమిండియా నుంచి విరాట్‌ కోహ్లి, శుబ్‌మన్‌ గిల్‌లు సెంచరీలు చేశారు. మ్యాచ్‌ డ్రాగా ముగిసినప్పటికి తొలి రెండు టెస్టులను గెలిచిన టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. తద్వారా వరుసగా నాలుగోసారి బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని టీమిండియా తమవద్దే అట్టిపెట్టుకుంది.

ఈ విషయం పక్కనబెడితే ఆట ఆఖరిరోజున చివరి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ స్పెషలిస్ట్‌లుగా ముద్రపడిన పుజారా, గిల్ చేతికి బంతినిచ్చి వారిచేత బౌలింగ్‌ చేయించాడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. పుజారా బౌలింగ్‌పై అశ్విన్‌.. ఇలా అయితే ఎలా.. నేను బౌలింగ్‌ జాబ్‌ వదిలేయాలా? అని చేసిన కామెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అశ్విన్‌ కామెంట్‌పై పుజారా స్పందించాడు.

''లేదు.. నాగ్‌పూర్‌ టెస్టులో నేను ఆడాల్సిన మూడోస్థానంలో నువ్వు బ్యాటింగ్‌కు వచ్చావు. అందుకు కృతజ్ఞత చెప్పాలనే ఇలా చేశాను'' అంటూ ఫన్నీగా స్పందించాడు. ఆ వెంటనే అశ్విన్‌ మరో ట్వీట్‌ చేశాడు.. ''పుజారా నీ ఉద్దేశం ప్రశంసించేలా ఉంది.. కానీ ఇలా తిరిగి ఇచ్చేస్తావని నేను ఊహించలేదు'' అని తెలిపాడు. దీనిపై పుజారా మరో ట్వీట్‌ చేశాడు. ''నీకు మంచి విశ్రాంతినిస్తా.. భవిష్యత్తులో ఎప్పుడైనా వన్‌డౌన్‌లో నువ్వు వచ్చేందుకు సాయపడతా'' అంటూ పేర్కొన్నాడు.

ఇక సిరీస్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌, ఆల్‌రౌండర్‌ జడేజాతో కలిసి సంయుక్తంగా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో అశ్విన్‌ 25 వికెట్లు పడగొడితే.. జడేజా 22 వికెట్లు తీశాడు. ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ మార్చి 17 నుంచి ఆరంభం కానుంది.

చదవండి: 'ఇలా అయితే ఎలా.. బౌలింగ్‌ జాబ్‌ వదిలేయాలా?'

WTC: ఎలాగోలా ఫైనల్‌కు చేరామే కానీ, మన వాళ్లు సాధించిందేమిటి..?

మరిన్ని వార్తలు