‘పింక్‌’ గురించి అతిగా ఆలోచించడం అనవసరం: పుజారా

21 Feb, 2021 05:47 IST|Sakshi

తగిన సమయం ఉందన్న పుజారా  

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌లో ఏడేళ్ల విరామం తర్వాత చతేశ్వర్‌ పుజారాకు అవకాశం లభించింది. అయితే చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున తగినన్ని మ్యాచ్‌లు లభించే అవకాశం లేదు కాబట్టి ఐపీఎల్‌ జరిగే సమయంలో అతను ఇంగ్లండ్‌లో కౌంటీల్లో ఆడితేనే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. దీనిపై పుజారా స్పందించాడు. లీగ్‌ తర్వాత కూడా ఇంగ్లండ్‌ గడ్డపై జరగబోయే సిరీస్‌కు తమ వద్ద తగినంత సమయం ఉంటుదని అతను అన్నాడు. ‘ఐపీఎల్‌లో పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది. నన్ను ఎంచుకున్న చెన్నైకి కృతజ్ఞతలు. అయితే ముందుగా ఐపీఎల్‌పైనే దృష్టి పెడతా. అది ముగిసిన తర్వాతే మరోదాని గురించి ఆలోచిస్తా.

నాకు తెలిసి ఇంగ్లండ్‌తో ఆ దేశంలో జరిగే సిరీస్‌కు ముందు కచ్చితంగా కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు సమయం లభిస్తుంది. అది నాకు సరిపోతుంది’ అని పుజారా స్పష్టం చేశాడు. మరో వైపు ఎస్‌జీ పింక్‌ బంతులు టెస్టు మ్యాచ్‌ ఎలా స్పందిస్తాయో సరిగ్గా చెప్పలేమని పుజారా అభిప్రాయ పడ్డాడు. రెండే డే అండ్‌ నైట్‌ టెస్టులు ఆడిన భారత్‌కు సహజంగానే దానిపై అవగాహన తక్కువగా ఉందని అతను అన్నాడు. ‘మూడో టెస్టులో బంతి ఎంత వరకు స్వింగ్‌ అవుతుందో ఎవరికీ తెలీదు. ఆరంభంలో కొంత వరకు బాగా స్పందిస్తుందని చెబుతున్నారు కానీ గులాబీ బంతిని అంచనా వేయడం అంత సులువు కాదు. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం అనవసరం. నా ఆటపై నాకు నమ్మకముంది’ అని పుజారా వ్యాఖ్యానించాడు.  

మరిన్ని వార్తలు