Punam Raut: అంపైర్‌ ఔటివ్వలేదు.. పెవిలియన్‌ చేరి మనసులు దోచుకుంది

1 Oct, 2021 16:11 IST|Sakshi

Punam Raut Walks Despite Being Given Not Out.. ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరుగుతున్న పింక్‌బాల్‌ టెస్టులో టీమిండియా బ్యాటర్స్‌ ఒకేరోజు రెండు అద్భుతాలు చేసి చూపించారు. ఆసీస్‌ గడ్డపై సెంచరీ బాదిన తొలి టీమిండియా మహిళా క్రికెటర్‌గా.. తొలి పింక్‌ బాల్‌ టెస్టులోనే శతక్కొట్టిన స్మృతి మంధన చరిత్ర సృష్టించగా.. మరో టీమిండియా బ్యాటర్‌ పూనమ్‌ రౌత్‌ అభిమానుల మనసులు గెలుచుకుంది. అంపైర్‌ ఓటవ్వికున్నా తనకు తానుగా క్రీజు వీడి క్రీడాస్పూర్తి ప్రదర్శించింది. విషయంలోకి వెళితే.. పింక్‌బాల్‌ టెస్టులో భాగంగా ఆట రెండో రోజు పూనమ్‌ రౌత్‌ 36 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ 81వ ఓవర్‌లో మొలినుక్స్‌ వేసిన నాలుగో బంతిని పూనమ్‌ ఫ్లిక్‌ చేయగా.. కీపర్‌ హీలే దానిని అందుకుంది. అంపైర్‌కు అప్పీల్‌ చేయగా అతను ఔట్‌ కాదంటూ సిగ్నల్‌ ఇచ్చాడు.

చదవండి: Smriti Mandhana: చారిత్రక టెస్ట్‌ మ్యాచ్‌లో రికార్డు శతకం.. కోహ్లి తర్వాత..!

అయితే రౌత్‌ మాత్రం బంతి తన బ్యాట్‌కు తగిలిందని నిర్థారణకు వచ్చి అంపైర్‌ నిర్ణయం చూడకుండానే వాకౌట్‌ చేసింది. ఈ చర్యతో అంపైర్‌తో పాటు ఆసీస్‌ మహిళా క్రికెటర్లు ఆశ్చర్యపోయారు.. అనంతరం క్రీడాస్పూర్తిని ప్రదర్శించిన పూనమ్‌ను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్‌ ఆస్ట్రేలియా స్వయంగా ట్విటర్‌లో షేర్‌ చేసింది. ''నమ్మశక్యం కాని విషయం.. పూనమ్‌ రౌత్‌ ఔట్‌ కాదని అంపైర్‌ అన్నాడు.. కానీ ఆమె పెవిలియన్‌కు చేరింది.. సూపర్‌ పూనమ్‌ రౌత్‌ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. పూనమ్‌ రౌత్‌ చేసిన పనిని మెచ్చకుంటున్న అభిమానులు ఆమె క్రీడాస్పూర్తిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. 

ఇక టీమిండియా రెండో రోజు టీ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. క్రీజ్‌లో దీప్తి శర్మ(12), తానియా భాటియా ఉన్నారు. ఆసీస్‌ బౌలర్లలో సోఫి మోలినెక్స్‌ 2, ఆష్లే గార్డనర్‌, ఎలైస్‌ పెర్రీ తలో వికెట్‌ పడగొట్టగా.. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(30) రనౌటైంది. భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ(31), పూనమ్‌ రౌత్‌(36) పర్వాలేదనిపించగా, యస్తికా భాటియా(19) నిరాశపరిచింది. అంతకుముందు తొలి రోజు వర్షం అంతరాయం కలిగించడంతో కేవ‌లం 44 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది. 

చదవండి: Ashes Series: మిమ్మల్ని ఎవరూ రమ్మని బలవంతం చేయడం లేదు

మరిన్ని వార్తలు