దినసరి కూలీగా మారిన 23 ఏళ్ల పంజాబ్‌ ప్లేయర్‌

11 Jun, 2021 14:39 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 23 ఏళ్ల పంజాబ్‌ అథ్లెట్‌ హర్దీప్‌ కౌర్‌, ప్రస్తుతం కుటుంబ పోషణ నిమిత్తం దినసరి కూలీగా మారింది. రోజుకు రూ.300 సంపాదన కోసం వరి పొలాల్లో పని చేస్తుంది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 20కి పైగా పతకాలు సాధించిన ఆమె.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా దుర్భర జీవితం కొనసాగిస్తుంది. ఓ వైపు విద్యను(ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా) అభ్యసిస్తూనే, తల్లిదండ్రులతో కలిసి కూలీ పనులకు వెళ్తుంది. 2018లో మలేషియాలో జరిగిన కరాటే పోటీల్లో స్వర్ణం సాధించిన హర్దీప్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అప్పటి పంజాబ్‌ క్రీడామంత్రి రాణా గుర్మీత్‌ సోధీ హామీ ఇచ్చారు. 

అయితే ఆ హామీ మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అమల్లోకి రాకపోవడంతో ఆమె ఆవేదన చెందుతుంది. ఉద్యోగం కోసం ప్రభుత్వ పెద్దలను ఎన్ని సార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, దీంతో తప్పని పరిస్థితుల్లో పొలం పనులకు వెళ్లాల్సి వస్తుందని వాపోతుంది. తండ్రి నయాబ్‌ సింగ్‌, తల్లి సుఖ్విందర్‌ కౌర్‌ తన క్రీడా భవిష్యత్తు కోసం చాలా శ్రమించారని, ఉన్నది అమ్ముకుని తనను ఈ స్థాయికి తెచ్చారని, వారి బాధ చూడలేకే తాను వారితో కలిసి పనికి వెళ్తున్నానని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాక ఇటువంటి పరిస్థితి వస్తుందని తానెప్పుడు ఊహించలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని ఆమె ఆశగా ఎదురు చూస్తుంది.
చదవండి: ఆ ఇంగ్లీష్‌ బౌలర్‌ పీక కోస్తానన్నాడు.. అందుకే అలా చేశా

మరిన్ని వార్తలు