IPL 2022 PBKS Vs GT: గుజరాత్‌ జోరుకు పంజాబ్‌ బ్రేక్‌.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం

4 May, 2022 08:01 IST|Sakshi
పంజాబ్‌ కింగ్స్‌ జట్టు(PC: IPL/BCCI)

ముంబై: ఈ సీజన్‌లో నిలకడైన విజయాలతో దూసుకెళుతున్న గుజరాత్‌ టైటాన్స్‌కు పంజాబ్‌ కింగ్స్‌ షాక్‌ ఇచ్చింది. మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ దెబ్బతో పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో గుజరాత్‌ను కంగుతినిపించింది. తొలుత టైటాన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (50 బంతుల్లో 65 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రబడ 4 వికెట్లతో గుజరాత్‌ను దెబ్బ తీశాడు. తర్వాత పంజాబ్‌ 16 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (53 బంతుల్లో 62 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించాడు. లివింగ్‌స్టోన్‌ (10 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.  

బౌలింగ్‌ ‘పంజా’బ్‌ 
గుజరాత్‌ ఇన్నింగ్స్‌ను పంజాబ్‌ బౌలింగ్‌ శాసించింది. ఓపెనర్లు గిల్‌ (9), సాహా (21; 3 ఫోర్లు, 1 సిక్స్‌)లతో మొదలైన పతనం ఆఖరిదాకా అలాగే సాగిపోయింది. గిల్‌ లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. రబడ ఓవర్లో సిక్సర్‌ బాదిన సాహా మరుసటి బంతికే పెవిలియన్‌ చేరాడు. దీంతో పవర్‌ ప్లేలో టైటాన్స్‌ 42/2 స్కోరు చేసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (1) కూడా నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకోవడంతో... మిల్లర్‌ (11), సాయి సుదర్శన్‌ వికెట్లు కాపాడుకునేందుకు ప్రయత్నం చేశారు. లివింగ్‌స్టోన్‌... మిల్లర్‌ను బోల్తా కొట్టించాడు. 

సుదర్శన్‌ పోరాటం 
వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సాయి సుదర్శన్‌ ఒంటరి పోరాటం చేశాడు. అయితే మరోవైపు రబడ వరుస బంతుల్లో తెవాటియా (11), రషీద్‌ ఖాన్‌ (0)లను అవుట్‌ చేశాడు. తర్వాత ప్రదీప్‌ సాంగ్వాన్‌ (2), ఫెర్గూసన్‌ (5) ఇలా వచ్చి అలా వెళ్లారు. అర్‌‡్షదీప్, లివింగ్‌స్టోన్, రిషి ధావన్‌ తలా ఒక వికెట్‌ తీయగా... సందీప్‌ శర్మ (4–0–17–0) వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్స్‌ను కట్టడి చేశాడు. 

ధావన్‌ దంచెన్‌ 
జోరు మీదున్న గుజరాత్‌ బ్యాటర్స్‌ విఫలమైన చోట పంజాబ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అవలీలగా షాట్లు బాదేశాడు. మూడో ఓవర్లో షమీ... బెయిర్‌స్టో (1) వికెట్‌ తీయగానే సంబరపడిపోయిన టైటాన్స్‌ను ధావన్‌ తన ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో డీలా పడేలా చేశాడు. రాజపక్సతో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించడంతోనే గుజరాత్‌ పనైపోయింది.

ప్రత్యర్థి బౌలర్లు ఏమాత్రం గతితప్పిన బంతులు వేసినా... వాటికి బౌండరీ దారి చూపాడు. రాజపక్స (28 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1సిక్స్‌) కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో 6.2 ఓవర్లో 50 చేరిన పంజాబ్‌ స్కోరు అదేస్పీడ్‌తో 12.1 ఓవర్లో వందను దాటేసింది. శిఖర్‌ 38 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్‌) ఫిఫ్టీ సాధించాడు. 15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ 117/2 స్కోరు చేసింది. విజయ సమీకరణం 30 బంతుల్లో 27 పరుగులు కాగా... షమీ వేసిన 16వ ఓవర్‌ను లివింగ్‌స్టోన్‌ చితగ్గొట్టాడు. 6, 6, 6, 4, 2, 4లతో 28 పరుగులు పిండేయడంతో అనూహ్యంగా ఇంకా 4 ఓవర్లు మిగిలుండగానే పంజాబ్‌ జయభేరి మోగించింది.

చదవండి: Rishi Dhawan Vs Hardik Pandya: గుజరాత్‌ కెప్టెన్‌కు రిషి ధవన్‌ ఫ్లైయింగ్‌ కిస్‌; నిరాశలో హార్దిక్‌ భార్య

Poll
Loading...
మరిన్ని వార్తలు