SRH Vs PBKS: హోల్డర్‌ మెరిసినా... సన్‌రైజర్స్‌ అవుట్‌

26 Sep, 2021 04:10 IST|Sakshi

ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన హైదరాబాద్‌

పంజాబ్‌ చేతిలో 5 పరుగులతో ఓటమి

హోల్డర్‌ పోరాటం వృథా

స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న కింగ్స్‌

ఐపీఎల్‌ సీజన్‌లో మీది చెత్త జట్టా...లేక మాదా! శనివారం ఒకదశలో పంజాబ్‌ కింగ్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆట చూస్తే ఇరు జట్లు ఈ విషయంలో ఒకరితో మరొకరు పోటీ పడినట్లు అనిపించాయి. పట్టికలో చివరి రెండు స్థానాలతో బరిలోకి దిగిన ఈ టీమ్‌ల పేలవ ఆటతో మూడొంతుల మ్యాచ్‌ చప్పగా సాగింది. అయితే జేసన్‌ హోల్డర్‌ బ్యాటింగ్‌ సీన్‌ను ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేసింది. రైజర్స్‌ విజయం కోసం 42 బంతుల్లో 66 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన హోల్డర్‌ సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. తనొక్కడే 29 బంతుల్లో 47 పరుగులు చేసి విజయానికి చేరువగా తెచి్చనా గెలుపు గీత దాటించలేకపోయాడు. ఉత్కంఠ క్షణాలను దాటి చివరకు పంజాబ్‌ ఊపిరి పీల్చుకోగా... హైదరాబాద్‌ జట్టు అధికారికంగా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ని్రష్కమించింది. 
 
షార్జా: గత మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిన పంజాబ్‌ కింగ్స్‌ ఈసారి 125 పరుగుల స్కోరును కూడా కాపాడుకోగలిగింది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో సన్‌ విజయానికి 17 పరుగులు అవసరం కాగా, 11 పరుగులే వచ్చాయి. ఆఖరి బంతికి 7 పరుగులు కావాల్సి ఉండగా... ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన పేసర్‌ ఎలిస్‌ సింగిల్‌ మాత్రమే ఇచ్చాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.

మార్క్‌రమ్‌ (32 బంతుల్లో 27; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా, హోల్డర్‌ (3/19) ప్రత్యరి్థని కట్టడి చేశాడు. అనంతరం సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులే చేయగలిగింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జేసన్‌ హోల్డర్‌ (29 బంతుల్లో 47 నాటౌట్‌; 5 సిక్సర్లు) చెలరేగగా, వృద్ధిమాన్‌ సాహా (37 బంతుల్లో 31; 1 ఫోర్‌) రాణించాడు. రవి బిష్ణోయ్‌కు 3 వికెట్లు దక్కాయి. హోల్డర్‌ బ్యాటింగ్‌ను మినహాయిస్తే సన్‌ మొత్తం ఇన్నింగ్స్‌లో రెండంటే రెండే ఫోర్లు ఉన్నాయి!

గేల్‌ విఫలం...
పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ఏ దశలోనూ దూకుడు కనిపించలేదు. నెమ్మదిగా ఉన్న పిచ్‌పై షాట్లు ఆడటం కొంత ఇబ్బందిగా ఉండటంతో పాటు హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. టాప్‌–4లో ఒక్కరి స్ట్రయిక్‌రేట్‌ కూడా వందకంటే ఎక్కువగా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్లు రాహుల్‌ (21 బంతుల్లో 21; 3 ఫోర్లు), మయాంక్‌ (5) తొలి నాలుగు ఓవర్లలో 26 పరుగులు జోడించగలిగారు. అయితే ఐదో ఓవర్‌ వేసిన హోల్డర్‌ మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ వైపు తిప్పాడు. తొలి బంతికి, ఐదో బంతికి అతను ఓపెనర్లను అవుట్‌ చేశాడు.

ఆ తర్వాత ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా కింగ్స్‌కు కావాల్సిన పరుగులు అందించలేకపోయాడు. గత మ్యాచ్‌లో అవకాశం దక్కని క్రిస్‌ గేల్‌ (17 బంతుల్లో 14; 1 ఫోర్‌) ఈసారి తుది జట్టులోకి వచి్చనా అతని బ్యాటింగ్‌లో జోరు కనిపించలేదు. రషీద్‌ తొలి ఓవర్లోనే అతను వికెట్ల ముందు దొరికిపోగా, రివ్యూ చేసినా ఫలితం లేకపోయింది. 3 పరుగుల వద్ద వార్నర్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన మార్క్‌రమ్‌ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలిచినా ఆ ‘లైఫ్‌’ వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు. కీలకమైన నాలుగు ఓవర్లలో (16–19) పంజాబ్‌ కనీసం ఒక్క ఫోర్‌ కూడా కొట్టలేకపోయింది! చివరకు భువనేశ్వర్‌ వేసిన ఆఖరి ఓవర్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో మొత్తం 14 పరుగులు రావడంతో స్కోరు 120 దాటింది.  

టపటపా...
సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ కూడా పేలవ ప్రదర్శనలో పంజాబ్‌తో పోటీ పడ్డారు. ఆ జట్టు ఛేదన కూడా పేలవంగా ప్రారంభమైంది. షమీ దెబ్బకు జట్టు 10 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే వార్నర్‌ (2) అవుట్‌ కాగా, మూడో ఓవర్లో విలియమ్సన్‌ (1) వికెట్లపైకి ఆడుకున్నాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి జట్టు ఒకే ఒక ఫోర్‌తో 20 పరుగులు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో సన్‌రైజర్స్‌ జట్టుకు ‘పవర్‌ప్లే’లో ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం! మనీశ్‌ పాండే (13), కేదార్‌ జాదవ్‌ (12) మళ్లీ విఫలమై జట్టును కష్టాల్లో పడేశారు. ఒక ఎండ్‌లో నిలబడి సాహా పట్టుదలగా ఆడినా, చివర్లో హోల్డర్‌ ప్రదర్శనతో ఆశలు రేగినా...ఇవి హైదరాబాద్‌కు విజయాన్ని అందించలేకపోయాయి.

స్కోరు వివరాలు
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) (సబ్‌) సుచిత్‌ (బి) హోల్డర్‌ 21; మయాంక్‌ (సి) విలియమ్సన్‌ (బి) హోల్డర్‌ 5; గేల్‌ (ఎల్బీ) (బి) రషీద్‌ 14; మార్క్‌రమ్‌ (సి) పాండే (బి) సమద్‌ 27; పూరన్‌ (సి అండ్‌ బి) సందీప్‌ 8; హుడా (సి) (సబ్‌) సుచిత్‌ (బి) హోల్డర్‌ 13; హర్‌ప్రీత్‌ (నాటౌట్‌) 18; ఎలిస్‌ (సి) పాండే (బి) భువనేశ్వర్‌ 12; షమీ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 125.  
వికెట్ల పతనం: 1–26, 2–27, 3–57, 4–66, 5–88, 6–96, 7–118. బౌలింగ్‌: సందీప్‌ 4–0–20–1, భువనేశ్వర్‌ 4–0–34–1, హోల్డర్‌ 4–0–19–3, ఖలీల్‌ 3–0–22–0, రషీద్‌ ఖాన్‌ 4–0–17–1, సమద్‌ 1–0–9–1.  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 2; సాహా (రనౌట్‌) 31; విలియమ్సన్‌ (బి) షమీ 1; పాండే (బి) బిష్ణోయ్‌ 13; జాదవ్‌ (బి) బిష్ణోయ్‌ 12; సమద్‌ (సి) గేల్‌ (బి) బిష్ణోయ్‌ 1; హోల్డర్‌ (నాటౌట్‌) 47; రషీద్‌ ఖాన్‌ (సి అండ్‌ బి) అర్‌‡్షదీప్‌ 3; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 120. వికెట్ల పతనం: 1–2, 2–10, 3–32, 4–56, 5–60, 6–92, 7–105. బౌలింగ్‌: షమీ 4–1–14–2, అర్‌‡్షదీప్‌ 4–0–22–1, ఎలిస్‌ 4–0–32–0, హర్‌ప్రీత్‌ 4–0–25–0, రవి బిష్ణోయ్‌ 4–0–24–3.

మరిన్ని వార్తలు