IPL- Punjab Kings: మయాంక్‌ అగర్వాల్‌పై వేటు! స్పందించిన పంజాబ్‌ ఫ్రాంఛైజీ! ఇంతకీ ఏం చెప్పినట్టు?

24 Aug, 2022 13:11 IST|Sakshi
మయాంక్‌ అగర్వాల్‌(PC: BCCI/IPL)

తమ జట్టు కెప్టెన్సీ అంశంపై వ్యాప్తి చెందుతున్న వదంతులపై ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ పంజాబ్‌ కింగ్స్‌ స్పందించింది. ఈ విషయం గురించి కొన్ని స్పోర్ట్స్‌ వెబ్‌సైట్లలో వస్తున్న వార్తలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. కెప్టెన్సీ విషయానికి సంబంధించి తమ ఫ్రాంఛైజీకి చెందిన ఏ ఒక్క అధికారి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. ఈ మేరకు పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ ట్వీట్‌ చేసింది.

కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా విఫలం
కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు కేఎల్‌ రాహుల్‌ పంజాబ్‌ కింగ్స్‌ను వీడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో కెప్టెన్‌గా మయాంక్‌ అగర్వాల్‌ను నియమించింది యాజమాన్యం. మయాంక్‌ సారథ్యంలో పంజాబ్‌ పద్నాలుగింట 7 మ్యాచ్‌లు గెలిచి 14 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది.

జట్టు పరిస్థితి ఇలా ఉంటే.. బ్యాటర్‌గానూ మయాంక్‌ అగర్వాల్‌ విఫలమయ్యాడు. ఆడిన 12 ఇన్నింగ్స్‌లో అతడు చేసిన పరుగులు మొత్తం 196. అత్యధిక స్కోరు 52. ఇదిలా ఉంటే.. శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీ షా వంటి యువ ఆటగాళ్లు సంప్రదాయ క్రికెట్‌లోనూ రాణిస్తున్న తరుణంలో టీమిండియాలోనూ మయాంక్‌కు చోటు కష్టంగానే మారింది.

మా వాళ్లు ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు!
ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్సీ నుంచి మయాంక్‌ అగర్వాల్‌ను తొలగించబోతున్నారంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదే విధంగా కోచింగ్‌ విషయంలో ట్రెవర్‌ బెయిలిస్‌తోనూ ఫ్రాంఛైజీ సంప్రదింపులు జరుపుతోందంటూ రూమర్లు వ్యాపించాయి. ఈ విషయంపై బుధవారం సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన పంజాబ్‌ యాజమాన్యం.. సదరు వార్తలు రాసిన సైట్ల తీరును విమర్శించింది.

‘‘గత కొన్ని రోజులుగా స్పోర్ట్స్‌ న్యూస్‌ వెబ్‌సైట్లలో పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ కెప్టెన్సీ విషయం గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం గురించి మా అధికారి ఎవరూ కూడా ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నాం’’ అని పేర్కొంది.

అయితే, ఆ వార్తల్ని మాత్రం ఖండిస్తున్నట్లు పేర్కొనకపోవడంతో మయాంక్‌ అగర్వాల్‌ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కెప్టెన్సీ ఉంటుందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. కాగా పంజాబ్‌ ఇంతవరకు ఒక్కసారి ఐపీఎల్‌ ట్రోఫీ గెలవలేదన్న విషయం తెలిసిందే. ఇక పంజాబ్‌ను వీడిన రాహుల్‌.. కొత్త లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఆరంభ సీజన్‌లోనే లక్నోను ప్లే ఆఫ్స్‌కు చేర్చి సత్తా చాటాడు. 

చదవండి: Mayank Agarwal: శతకంతో చెలరేగినా టీమిండియాలోకి రావడం కష్టమే!
KL Rahul Wedding: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ పెళ్లి ఆమెతోనే! ధ్రువీకరించిన ‘మామగారు’.. కానీ ట్విస్ట్‌ ఏంటంటే!

మరిన్ని వార్తలు