Punjab Kings: అనిల్‌ కుంబ్లేతో పంజాబ్‌ కటీఫ్‌! మయాంక్‌ విషయంలో మాత్రం..

26 Aug, 2022 05:58 IST|Sakshi

హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పించిన ఐపీఎల్‌ ఫ్రాంచైజీ  

మొహాలి: మూడు ఐపీఎల్‌ సీజన్లలో తమ జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించినా... ఆశించిన ఫలితాలు అందించలేకపోయిన అనిల్‌ కుంబ్లేతో పంజాబ్‌ కింగ్స్‌ బంధం తెంచుకుంది. వచ్చే సీజన్‌ కోసం కుంబ్లేతో ఒప్పందాన్ని పునరుద్ధరించడం లేదని ప్రకటించింది. టీమ్‌ యజమానులైన ప్రీతి జింటా, నెస్‌ వాడియా తదితరులు కలిసి సమష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

త్వరలోనే కొత్త కోచ్‌ను ఫ్రాంచైజీ ఎంపిక చేస్తుంది. 2020లో కుంబ్లే హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా వరుసగా రెండేళ్లు టీమ్‌ ఐదో స్థానంలో నిలిచింది. 2022లో పది టీమ్‌ల ఐపీఎల్‌లో పంజాబ్‌ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. జట్టులో ఎన్ని మార్పులు చేసినా, వ్యూహాలు మార్చినా పంజాబ్‌ కోచ్‌ పదవి ఎవరికీ కలిసి రాలేదు.

2014 నుంచి చూస్తే ఆ జట్టుకు కుంబ్లే ఐదో కోచ్‌. వరుసగా సంజయ్‌ బంగర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రాడ్‌ హాడ్జ్, మైక్‌ హెసన్‌ కోచ్‌గా పని చేసినా జట్టు రాత మారలేదు. కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో పంజాబ్‌ 42 మ్యాచ్‌లు ఆడగా... 18 గెలిచి, 22 ఓడింది.మరో 2 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి.

ఓవరాల్‌గా కూడా 2008 నుంచి ఐపీఎల్‌లో ఉన్నా రెండుసార్లు మాత్రమే పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌కు వెళ్లగలిగింది. 2014లో ఫైనల్‌ చేరడం ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత సీజన్‌ వేలంలో బెయిర్‌స్టో, రబడ, లివింగ్‌స్టోన్, శిఖర్‌ ధావన్‌లాంటి ఆటగాళ్లను ఎంచుకున్నా ఫలితం మాత్రం మారలేదు. కోచ్‌ను తప్పించిన పంజాబ్‌ మరోవైపు కెప్టెన్‌గా మయాంక్‌ అగర్వాల్‌ను కొనసాగించే విషయంలో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
చదవండి: Asia Cup 2022: పాక్‌ క్రికెటర్‌పై పుజారా ప్రశంసల వర్షం

మరిన్ని వార్తలు