మళ్లీ ఓడిన సింధు, శ్రీకాంత్‌

29 Jan, 2021 04:46 IST|Sakshi

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ నుంచి అవుట్‌  

బ్యాంకాక్‌: భారత స్టార్‌ షట్లర్లు పూసర్ల వెంకట సింధు, కిడాంబి శ్రీకాంత్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో నిరాశ పరిచారు. సీజన్‌కు సంబంధించిన ఈ ముగింపు టోర్నీలో లీగ్‌ దశతోనే సరిపెట్టుకున్నారు. ప్రపంచ చాంపియన్‌ సింధు, మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ వరుసగా రెండో లీగ్‌ మ్యాచ్‌లోనూ పరాజయం పాలయ్యారు. దీంతో వీరిద్దరు సెమీస్‌ చేరుకునే అవకాశాలు గల్లంతయ్యాయి. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ ‘బి’లో గురువారం జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో తెలుగమ్మాయి సింధు 18–21, 13–21తో మాజీ ప్రపంచ చాంపియన్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓటమి చవిచూసింది. గత వారం ఇదే ప్రత్యర్థి చేతిలో థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో ఓడిన ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు ఈ మ్యాచ్‌లోనూ తన ఆటతీరును, ఫలితాన్ని మార్చుకోలేకపోయింది.

ప్రపంచ చాంపియన్‌పై మూడో సీడ్‌ రచనోక్‌కు ఇది ఆరో విజయం. వీరిద్దరూ పలు అంతర్జాతీయ టోర్నీల్లో ఇప్పటివరకు పది సార్లు తలపడితే సింధు 4 సార్లు మాత్రమే గెలిచింది. తొలి గేమ్‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. ఆరంభంలో అయితే సింధు దూకుడుగా ఆడటంతో 4–2తో మొదలైన ఆమె ఆధిక్యం 14–11 దాకా కొనసాగింది. ఈ దశలో రచనోక్‌ వరుసగా మూడు పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది. క్రమంగా సింధుపై తన ఆధిపత్యం చలాయిస్తూ 21–18తో గేమ్‌ నెగ్గింది. తర్వాత రెండో గేమ్‌లో సింధు పట్టు కోల్పోయింది. ఇదే అదనుగా రచనోక్‌ 9–8 స్కోరు వద్ద వరుసగా మూడు పాయింట్లు గెలుచుకుంది. వెంటనే సింధు కూడా మూడు పాయింట్లు చేసినప్పటికీ తర్వాత థాయ్‌లాండ్‌ స్టార్‌... సింధుకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా చెలరేగి ఆడింది.

దీంతో ఈ గేమ్, మ్యాచ్‌ గెలిచేందుకు ఆమెకు ఎంతోసేపు పట్టలేదు. 43 నిమిషాల్లో ఈ మ్యాచ్‌ ముగిసింది. పరాజయంపై సింధు మాట్లాడుతూ ‘ఈ రోజు నాది కాదు. నాకేం కలిసిరాలేదు. తొలి గేమ్‌ ఓడిపోవడం... తర్వాత నేను వెనుకబడటంతో మ్యాచ్‌లో నిరాశ తప్పలేదు’ అని పేర్కొంది. పురుషుల ఈవెంట్‌ గ్రూప్‌ ‘బి’లో భారత స్టార్‌ శ్రీకాంత్‌ 21–19, 9–21, 19–21తో నాలుగో సీడ్‌ వాంగ్‌ జు వె (చైనీస్‌ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడాడు. వాంగ్‌ జుపై శ్రీకాంత్‌కు 3–0తో మంచి రికార్డే ఉంది. అందుకు తగ్గట్లే శ్రీకాంత్‌ తొలి గేమ్‌ను గెలుచుకున్నాడు. కానీ రెండో గేమ్‌ను చిత్తుగా కోల్పోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో మళ్లీ పోరాటం చేసినప్పటికీ వాంగ్‌ జు ఆ అవకాశం ఇవ్వలేదు. గంటా 18 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ పోరులో శ్రీకాంత్‌కు పరాజయం తప్పలేదు. నేటి నామ   మాత్రమైన మ్యాచ్‌లో సింధు... పోర్న్‌పవి (థాయ్‌లాండ్‌)తో, శ్రీకాంత్‌... క లంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌)తో తలపడతారు. 

మరిన్ని వార్తలు