Commonwealth Games 2022: భారత ఫ్లాగ్‌ బేరర్‌గా పీవీ సింధు

27 Jul, 2022 20:12 IST|Sakshi

బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్‌ క్రీడలు రేపటి (జులై 28) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మహా క్రీడా సంగ్రామానికి సంబంధించి ప్రారంభ వేడుకలు (ఓపెనింగ్‌ సెర్మనీ) కూడా రేపే ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలు భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు మొదలవుతాయి. గాయం కారణంగా భారత పతాకధారి నీరజ్‌ చోప్రా ఈ ఈవెంట్‌ నుంచి తప్పుకోవడంతో ఓపెనింగ్ సెర్మనీలో బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు భారత ఫ్లాగ్‌ బేరర్‌గా వ్యవహరించనుంది.

ఈ విషయాన్ని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్ (ఐఓఏ)‌ బుధవారం (జులై 27) వెల్లడించింది. రెండుసార్లు ఒలింపిక్‌ మెడల్స్‌ సాధించిన‌ సింధుకు గతంలో పలు సందర్భాల్లో భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని టీమిండియాను లీడ్‌ చేసిన అనుభవం ఉంది. 

ఇదిలా ఉంటే, 72 దేశాల నుంచి 5 వేలకుపైగా అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. 12 రోజుల పాటు (జులై 28- ఆగస్ట్‌ 8) 20 క్రీడా విభాగాల్లో అథ్లెట్లు పోటీ పడనున్నారు. 18వ సారి ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్న భారత్‌.. మొత్తం 16 విభాగాల్లో 214 మంది అథ్లెట్లతో పోటీపడుతుంది. భారత్‌ బంగారు పతకాలు సాధించే అవకాశం ఉన్న విభాగాల్లో మహిళల బ్యాడ్మింటన్‌ కూడా ఒకటి. ఈ ఈవెంట్‌కు ముందే సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి జోరుమీదున్న సింధు ఈసారి తప్పక గోల్డ్‌ సాధిస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. సింధు గత కామన్వెల్త్‌ గేమ్స్‌ సింగిల్స్‌లో సిల్వర్‌ మెడల్‌, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో గోల్డ్‌ మెడల్ సాధించింది.
చదవండి: పంతం నెగ్గించుకున్న లవ్లీనా.. కామన్‌వెల్త్‌ గ్రామంలోకి కోచ్‌కు అనుమతి
 

మరిన్ని వార్తలు