క్వార్టర్‌ ఫైనల్లో సింధు

22 Oct, 2021 05:16 IST|Sakshi

కెంటో మొమోటా చేతిలో ఓడిన శ్రీకాంత్‌

డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

ఒడెన్స్‌: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు 21–16, 12–21, 21–15తో బుసానన్‌ ఒంగ్‌బమృంగ్‌ఫాన్‌ (థాయ్‌లాండ్‌)పై పోరాడి గెలిచింది. 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను సింధు సులభంగా చేజిక్కించుకుంది. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న బుసానన్‌ వరుసగా పాయింట్లను సాధిస్తూ సింధుపై ఆధిపత్యం ప్రదర్శించింది. దాంతో మ్యాచ్‌ మూడో గేమ్‌కు దారి తీసింది. ఇక్కడ లయను అందుకున్న సింధు గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది.

పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్‌లకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ 21–23, 9–21తో ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మొమోటా (జపాన్‌) చేతిలో, లక్ష్యసేన్‌ 15–21, 7–21తో విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్‌లో ఏడో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 21–14, 15–21, 15–21తో గో జె ఫీ–నూర్‌ ఇజుద్దీన్‌ (మలేసియా) జంట చేతిలో ఓడగా... మరో భారత జంట ఎంఆర్‌ అర్జున్‌–ధ్రువ్‌ కపిల 15–21, 21–17, 12–21తో ఫజార్‌ అల్ఫియాన్‌– మొహమ్మద్‌ రియాన్‌ అర్డియాంటో (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో భారత ద్వయం ధ్రువ కపిల–సిక్కి రెడ్డి 17–21, 21–19, 11–21తో తాంగ్‌ చున్‌మన్‌– త్సెయింగ్‌ సుయెట్‌ (హాంకాంగ్‌) జంట చేతిలో ఓడింది.  
 

మరిన్ని వార్తలు