సింధుకు సులువు

9 Jul, 2021 05:35 IST|Sakshi

ఒలింపిక్స్‌ ‘డ్రా’ విడుదల

టోక్యో: రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత, భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు తాజా ఒలింపిక్స్‌లో సులువైన ‘డ్రా’ ఎదురైంది. ఆరో సీడ్‌గా ఉన్న సింధు మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ ‘జె’లో తన పోరును ప్రారంభించనుంది. ఇందులో సింధుతో పాటు హాంకాంగ్‌కు చెందిన చెంగ్‌ గాన్‌ యి (ప్రపంచ 34వ ర్యాంకర్‌), ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పొలికర్పొవా (58) ఉన్నారు. సింధు స్థాయితో పోలిస్తే వీరిద్దరు బలహీన ప్రత్యర్థులే. వీరిద్దరిపై సింధు రికార్డు 5–0, 2–0గా ఉంది. 

మొత్తం 16 గ్రూప్‌లు ఉండగా ఒక్కో గ్రూప్‌నుంచి ఒక్కో ప్లేయర్‌ ముందంజ వేస్తారు. ఆపై నాకౌట్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి. సంచలనాలు లేకపోతే సింధు క్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన యామగూచితో తలపడే అవకాశం ఉంది. పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్‌ ముందంజ వేయాలంటే తన గ్రూప్‌లో ఉన్న మార్క్‌ కాల్జో (29; నెదర్లాండ్స్‌), జిల్బర్‌మన్‌ (47; ఇజ్రాయెల్‌)లను అధిగమించాల్సి ఉంటుంది. ప్రిక్వార్టర్స్‌లో అతను లాంగ్‌ ఆంజస్‌ (హాంకాంగ్‌)ను ఓడించగలిగితే జపాన్‌ స్టార్, ఫేవరెట్‌ మొమొటాను క్వార్టర్స్‌లో ఎదుర్కోవాల్సి రావచ్చు.

మరిన్ని వార్తలు